జ‌గ‌న్ పార్టీ మీద బీజేపీ పడగ

July 12, 2020

అచ్చంగా జ‌గ‌న్ ఫార్ములాతోనే...ఆయ‌న దారిలోనే...ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ...ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు షాకివ్వ‌నున్నారా? జ‌గ‌న్ దూకుడుకు బ్రేక్ వేసే విష‌యంలో ఫోక‌స్ పెట్టిన బీజేపీ పెద్ద‌లు...ఇప్పుడు రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌ను నేరుగా అమ‌లు చేయ‌నున్నారా? ఇప్పుడు ఈ చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఓ వైసీపీ ఎంపీని త‌మ గూటికి చేర్చుకునే క్ర‌మంలో...టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఏపీ సీఎం జ‌గ‌న్ ఇచ్చిన‌ట్లే...షాకివ్వ‌చ్చ‌ని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ రాజకీయాల‌కు సైతం గుడ్ బై చెప్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే, అనంత‌రం కొద్దిరోజుల‌కు  మీడియాతో మాట్లాడిన వంశీ తాను ప‌ద‌వికి రాజీనామా చేయ‌బోన‌ని ప్ర‌క‌టిస్తూ....తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉంటూనే...అధికార వైసీపీకి మద్దతిస్తాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్‌తో కలిసి నడుస్తా...అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని ప్ర‌క‌టించారు.

తాజాగా వైసీపీకి చెందిన ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు విష‌యంలోనూ...బీజేపీ ఈ స్కెచ్ అమ‌ల్లో పెట్ట‌నుంద‌ని అంటున్నారు.  రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, మండల, జిల్లా పరిషత్ స్కూళ్లలో 1 నుంచి 10 క్లాసు వరకూ ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే,  వైసీపీ నేత‌, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్లమెంటులో ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా మాట్లాడారు. రఘురామకృష్ణంరాజు వైఖరిపై ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఇప్ప‌టికీ ఆయ‌న సీఎం జ‌గ‌న్‌కు వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు.

మ‌రోవైపు, బీజేపీ ఆయ‌న‌కు గాలం వేస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని మాత్రమే పలుకరించే ప్రధాని నరేంద్రమోడీ ఆ పార్టీకి చెందిన ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఆప్యాయంగా పలుకరించారు. రాజ్యసభనుంచి తన ఛాంబర్‌కు వెళుతున్న మోడీ సెంట్రల్‌ హాల్‌లో ఎదురైన రఘురామకృష్ణం రాజును ”రాజుగారూ బాగున్నారా” అంటూ ఆప్యాయంగా పలుకరించారు. అయితే, ఈ ఘ‌ట‌న జ‌రిగింది..పార్ల‌మెంటులో ర‌ఘురామ‌కృష్ణంరాజు స్పందించిన త‌ర్వాతే. ఓ వైపు బీజేపీ నేత‌లు ఆంగ్ల మాధ్య‌మంపై గ‌లం వినిపించ‌డం మ‌రోవైపు సాక్షాత్తు ప్ర‌ధాన‌మంత్రి వైసీపీ ఎంపీని ప్ర‌శంసించ‌డం వెనుక‌...వైసీపీలో తేడా వ‌స్తే ఆయ‌న‌కు బీజేపీ అండ‌గా ఉంద‌నే సిగ్న‌ల్  ఇవ్వ‌డ‌మేన‌ని అంటున్నారు.