సరికొత్త డ్రామాకు తెరలేపిన వైసీపీ

September 17, 2019

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముందు నుంచే సమాయత్తమవుతోంది. ఇందుకోసం ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎన్నో వ్యూహాలు సిద్ధం చేశారు. ముందు నుంచీ ప్రణాళికాబద్ధంగా పయనిస్తున్నారు. ఎన్నికల కోసమే ఎప్పుడో బూత్‌ కమిటీలు వేశారు. గడపగడపకూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వంటి కార్యక్రమాలతో ఆ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు. పార్టీకి కేడర్‌ పరంగా పునాది బలంగా ఉండాలని ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో అప్పటి వరకు ఉన్న సమన్వయకర్తలను సైతం పక్కన పెట్టి.. ఆర్థికంగా బలంగా ఉన్న నేతలకు టికెట్లు కేటాయించారు. మరోవైపు అధికార పక్షాన్ని మానసికంగా దెబ్బకొట్టాలనే ఉద్దేశ్యంతో ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలను తమ పార్టీలో చేర్చుకున్నారు. ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆయన మరింత స్పీడు పెంచుతున్నారు. ఎన్నికల్లో విజయం సాధించడం కోసం కొత్త కొత్త విధానాలను అమలు చేస్తున్నారు.

ఇందులో భాగంగానే వైసీపీ అధినేత సరికొత్త డ్రామాకు తెరలేపారు. అదే.. సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్(సీపీఎస్) సర్వే. ఈ సంస్థ బుధవారం తమ సర్వే ఫలితాలను వెల్లడించింది. కొద్దిరోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఈ సర్వే వెల్లడించింది. ఇందులో వైసీపీ ఏకంగా 121 నుంచి 130 ఎమ్మెల్యే సీట్లలో విజయభేరి మోగించి అధికారంలోకి రానుందని తేల్చిచెప్పింది. వైఎస్సార్‌సీపీ 21 ఎంపీ స్థానాల్లోనూ విజయం సాధించనుందని పేర్కొంది. కాగా, అధికార తెలుగుదేశం పార్టీ కేవలం 45 నుంచి 54 ఎమ్మెల్యే సీట్లు, 4 ఎంపీ సీట్లకే పరిమితం కానుందని ప్రకటించింది. జనసేన పార్టీకి కేవలం ఒకట్రెండు ఎమ్మెల్యే సీట్లు దక్కే అవకాశం ఉందని ఆ సర్వే తేల్చిచెప్పింది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకునే వైసీపీ సరికొత్త ప్లాన్ వేసిందని విశ్లేషకులతో పాటు పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

సర్వేల పేరుతో ఓటర్లను మానసికంగా తమ వైపునకు తిప్పుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నమే ఈ సర్వే అని స్పష్టమవుతోంది. ఈ సర్వేతో ప్రజలను నమ్మించడానికి ఆ పార్టీ అధిష్ఠానం సరైన వ్యూహాలను అమలు చేసినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో బాగా ప్రచారం పొందిన సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్(సీపీఎస్) సర్వేను వాళ్లు ఎంచుకున్నట్లు సమాచారం. ఎందుకంటే ముందస్తు ఎన్నికల్లో కొన్ని సంస్థలు ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందని, మరికొన్ని సంస్థలు గులాబీ దళానికి సగటున 60 నుంచి 70 దాకా సీట్లు వస్తాయని అంచగా వేయగా.. సీపీఎస్ సర్వే మాత్రం ఏకంగా 94 నుంచి 104 వరకు వస్తాయని తేల్చింది. అంతేకాదు, కాంగ్రెస్ సారథ్యంలోని ప్రజా కూటమికి 16 నుంచి 21 స్థానాలు, ఎంఐఎంకు 7, బీజేపీకి ఒకటో లేకపోతే రెండు రావొచ్చని చెప్పింది. ఈ సంస్థ చెప్పినట్లే ఫలితాలు వెల్లడయ్యాయి. దీంతో ఈ సర్వేను ప్రజలందరూ నమ్మారు. అందుకే ఈ సంస్థతో వైసీపీ సర్వే నాటకాలు ఆడుతుందనే కామెంట్ వినిపిస్తోంది.