ఎన్నారై వైసిపి US విభాగం లో కీచులాటలు

August 08, 2020

సిఎం హోదాలో జగన్మోహనరెడ్డి మొదటిసారి అమెరికా పర్యటనకి వెళ్తే వైసిపి అభిమానులు ఘనస్వాగతం పలుకుతారని అందరూ ఊహించారు. కానీ ఆదిలోనే హంసపాదు అన్న రీతిలో ఒక మంత్రికి కూడా మించని విధంగా ఎన్నారై వైసిపి విభాగం ఇంత పేలవంగా స్వాగతించడమేమిటి అని ఏపీలో పార్టీవర్గాలు విస్మయం చెందుతున్నాయట. ఆరా తీసినవారికి ఎన్నారై వైసిపి విభాగంలో, ఇతర నిర్వాహకుల మధ్య ముఠాకక్షల్ని తలదన్నే విధంగా జరుగుతున్న కీచులాటల వివరాలు తెలిసి విస్తుపోయారట.

మొన్నటి ఎన్నికల్లో వైసిపి గెలుపు కోసం, జగన్మోహనరెడ్డిని సిఎం చేయడం కోసం ఎన్నారై రెడ్డి సామాజికవర్గం అంతా ఏకమైందనే విషయం అందరికీ తెలిసిందే. ఆర్ధికవనరుల్ని సేకరించడం, సోషల్ మీడియాలోనూ, క్షేత్రస్థాయిలోనూ ప్రచారం నిర్వహించడంలో వీరు కీలకపాత్ర పోషించారు. ఇందులో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకి చెందిన ఎన్నారై రెడ్లది ప్రధాన పాత్ర. అదే సమయంలో తెలంగాణాలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో తెరాస గెలిచి కెసియార్ తిరిగి గద్దెనెక్కడంతో, కాంగ్రెస్ గెలిచి తిరిగి రెడ్లకు అధికారం వస్తుందని ఆశించిన తెలంగాణా ఎన్నారై రెడ్లకి ఆశాభంగమయింది. రెండు తెలుగురాష్ట్రాల్లో మళ్ళీ ఐదేళ్ళపాటు రెడ్లకి అధికారం లేకపోతే కష్టమేనని భావించిన తెలంగాణా ఎన్నారై రెడ్లు కూడా జగన్మోహన రెడ్డి గెలుపు కోసం ఏపీ రెడ్లకి బాసటగా నిలిచారు. వైసిపి గెలిచి, జగన్మోహనరెడ్డీ అధికారం చేపట్టిన తర్వాత ఇక్కడే కీచులాటలకి బీజం పడింది.

జగన్మోహనరెడ్డి అమెరికా పర్యటన సందర్భంగా జరగబోతున్న స్వాగత కార్యక్రమాలు, ఆత్మీయ సమావేశాల్లో కొందరు తెలంగాణా తెలుగుసంఘాల రెడ్డి ప్రముఖులకు పెద్దపీట వేయడం, ఏనాడూ బాహాటంగా జగన్‌కు మద్దతునీయనివారికి అగ్రతాంబూలం ఇవ్వడం ఆంధ్రా రెడ్లకి నచ్చక వివాదం మొదలయిందట. పైగా తెలంగాణా ఉద్యమ సమయంలో కొందరు తెలంగాణా ఎన్నారై రెడ్లు జగన్‌కు వ్యతిరేకంగా తీవ్రవ్యాఖ్యలు చేశారని, వారు ఇప్పుడు మేము వైఎస్సార్ అబిమానులం అనే వంకతో లోపలకి దూరారని ఆంధ్రా ఎన్నారై రెడ్లు వారిని వ్యతిరేకిస్తున్నారట.

ఇక ఏపీకి చెందిన ఎన్నారై రెడ్ల మధ్య కూడా తీవ్రవిభేదాలు మొదలయ్యాయట. ముఖ్యంగా రాయలసీమ రెడ్లంతా ఒక వర్గం కాగా మిగతా జిల్లాల రెడ్లు ఇంకో వర్గమయ్యారట. కష్టపడి జెండా మోసింది తామే అని, గెలిచేదాకా తటస్థుల్లా వ్యహరించిన అనేకమంది గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల రెడ్లు ఇప్పుడు జగన్ అమెరికా పర్యటనలో ముందువరుసలో నిల్చుని తమని వెనక్కి నెట్టేయడంపైన రాయలసీమ రెడ్డి వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నదట. అలాగే ఈ జిల్లాలకు చెందిన ఎన్నారై రెడ్డీ డాక్టర్లు, వ్యాపారస్తులు, కన్సల్టింగ్ కంపెనీల అధిపతులతో జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా సమావేశమవడాన్ని కూడా రాయలసీమ వర్గం జీర్ణించుకోలేకపోతున్నదట. పేరుకు జగన్మోహనరెడ్డిది రాయలసీమే అయినా ఎన్నారై వైసీపీలో పెత్తనమం మాత్రం వేరే ప్రాంతాల రెడ్లది అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.

ఇక ద్వితీయశ్రేణి ఎన్నారై రెడ్లది ఇంకో బాధ. సామాన్యులమైన తాము తోచినంత ధనసహాయం చేసి, ప్రచారం చేసి, ఊళ్ళల్లో ఓట్లు వేయిస్తే, సూటూబూటూ వేసుకున్న ఏపీ మరియు తెలంగాణా పెద్దరెడ్లు అందలమెక్కి, వారే జగన్మోహనరెడ్డిని గెలిపించినట్లు, వారి చేతులమీదుగానే జగన్ అమెరికా పర్యటన జరుగుతున్నట్లు షో చేస్తున్నారని, కరపత్రాలు పంచుతున్నారని తప్పుపడుతున్నారు. అయితే, జగన్ పర్యటనకి తాము లక్షల డాలర్లు సొంతడబ్బులు ఖర్చు పేదుతున్నామని, తమకి ఆ మాత్రం ప్రాముక్యత ఎందుకు ఉండగూడదని ఏపీ & తెలంగాణా పెద్దరెడ్లు ప్రశ్నిస్తున్నారట.

ఈ గొడవంతా ఇలా ఉంటే ఆంబోతుల యుద్ధంలో నలిగిపోతున్న లేగదూడల్లా ఇతర సామాజికవర్గాలకు చెందిన వైసిపి అభిమానులు నలిగిపోతున్నారట. డల్లాస్‌లో జగన్‌తో జరిగే ఆత్మీయసమావేశానికి ఏ వర్గానికి ఆ వర్గం పోటీపడి బస్సులు పెట్టి చుట్టుపక్కల రాష్ట్రాలనుండి ప్రవాసాంధ్రుల్ని, తెలంగాణావారిని తరలిస్తున్నారట. ఎవరి బస్సు ఎక్కితే ఏ తంటా వస్తుందో, ఏ వర్గం కన్నెర్రజేస్తుందో, మనకెందుకొచ్చిన గొడవ అని చాలామంది వెనుకంజ వేస్తున్నారట. మొత్తానికి జగన్మోహన రెడ్డి ముందే ఈ పంచాయితీ తేల్చుకుంటామని ఎన్నారై వైసిపి రెడ్లు బాహాటంగానే చర్చికుంటున్నారట. ఇక జగన్ ఈ వర్గపోరుని ఎలా పరిష్కరిస్తారో వేచిచూడాలి