యెడ్డీ కి లక్కు అలా వస్తోంది, ఇలా పోతోంది... అందుకే !

July 12, 2020

మూడుసార్లు ముఖ్యమంత్రయినా కూడా ఒక్కసారీ అయిదేళ్ల పదవీ కాలం పూర్తిచేయలేకపోవడం... అందులోనూ రెండుసార్లు అసలు వారం రోజులు కూడా కుర్చీలో ఉండకపోవడంతో కర్ణాటక కొత్త సీఎం యడ్యూరప్ప ఇప్పుడు నాలుగోసారైనా పూర్తికాలం పదవిలో ఉండాలని తెగ కోరుకుంటున్నారు. అందుకోసమే ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకూడదన్న ఉద్దేశంతో సంఖ్యాశాస్త్ర, జ్యోతిష్య శాస్త్రం వంటివీ ఫాలో అవుతూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసలే అంతంతమాత్రం బలంతో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటుండడంతో కుమారస్వామిలా తన ప్రభుత్వమూ కుప్పకూలే పరిస్థితి రాకుండా ఉండాలంటూ ఆయన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తన పేరులో స్వల్ప మార్పు చేసుకున్నారు.
పేరు మార్చుకుంటే ఫేట్ మారుతుందన్న ఆశతో యెడ్డీ అదే పనిచేశారు. ఇప్పటివరకు ఆయన BS Yaddyurappa అని ఉన్న తన పేరును ఇప్పుడు BS Yadiyurappaగా మార్చుకున్నారు. పేరు మార్పు వల్లయినా పదవి జారకుండా ఉంటుందన్న ఆశతో ఆయన ఈ పనిచేశారు. అందుకే శుక్రవారం గవర్నర్‌ వాజుభాయ్‌ వాలాకిచ్చిన లేఖలో తన పేరును యడియూరప్ప(Yediyurappa)గా రాసిచ్చారు.
యడియూరప్ప పేరు మార్చుకోవడం ఇదే తొలిసారి కాదు. 2007లో తొలిసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టినప్పుడు ఆయన పేరులో మార్పులు చేసుకున్నారు. యడియూరప్ప(BS Yediyurappa)ను యడ్యూరప్ప( BS Yeddyurappa)గా మార్చుకున్నారు. రాజకీయంగా ఆ సమయంలో కాస్త గడ్డుకాలాన్ని ఎదుర్కోవడంతో జ్యోతిషుడి సలహా ప్రకారం పేరులో అక్షరాలను మార్పు చేసుకున్నారు. కానీ ఆ ఫార్ములా వర్కవుట్‌ కాలేదని భావించిన యడ్డీ.. తాజాగా మళ్లీ పేరులో మార్పు చేశారు. మరి ఈసారైనా కొత్త పేరు పదవిని కాపాడుతుందో లేదో చూడాలి.