అచ్చం జగన్ మాదిరే బిహేవ్ చేస్తున్న ఆ రాష్ట్ర సీఎం

May 29, 2020

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మరో రాష్ట్ర ముఖ్యమంత్రితో పోల్చే పరిస్థితి రావటం చాలా తక్కువగా చెప్పాలి. తాజాగా.. అలాంటి సీన్ ఒకటి కనిపిస్తోంది. ఆపరేషన్ కర్ణాటకను విజయవంతంగా పూర్తిచేసి.. ఎట్టకేలకు కన్నడ పీఠాన్ని తమ సొంతం చేసుకోవటంలో బీజేపీ సక్సెస్ అయినట్లేనని చెప్పాలి. పలు ప్రయత్నాల అనంతరం కర్ణాటకలో అధికారాన్ని చేజిక్కించుకున్న కమలనాథులు.. తమ ముఖ్యమంత్రిగా యడియూరప్పను ఎంపిక చేయటం తెలిసిందే.
సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తన ముందున్న ప్రభుత్వం అమలు చేసిన.. చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు చెల్లు చీటి ఇచ్చేస్తున్నారు. కర్ణాటకలో పేరొందిన అన్న భాగ్య పథకాన్ని అటకెక్కించిన యడ్డి.. తాజాగా పేదలకు తక్కువ ధరకు కడుపునిండా భోజనం పెట్టే ఇందిరా క్యాంటీన్లను మూసివేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాలపై విపక్షం విరుచుకుపడుతోంది.
అన్నభాగ్య పథకంలో పేదలు ఒక్కొక్కరికి ఇచ్చే ఏడు కేజీల ఉచిత బియ్యాన్ని కట్ చేయటం ద్వారా ఇబ్బందులు తప్పవంటున్నారు. బియ్యంలో కోత విధిస్తే పేదల కడుపు కొట్టినట్లేనని మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. మరోవైపు ఇందిరా క్యాంటీన్లను క్లోజ్ చేస్తూ యడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏ మాత్రం సబబు కాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
కొందరైతే ఏపీలో జగన్ సర్కారు తీరును గుర్తుకు తెచ్చేలా యడ్డి వ్యవహరిస్తున్నారన్న విమర్శ వినిపిస్తోంది. గత ప్రభుత్వం అమలు చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాల్ని పక్కన పెట్టేయటం సరికాదంటున్నారు. యడ్డి సర్కారు నిర్ణయాలపై మాజీ ముఖ్యమంత్రి కమ్ ప్రతిపక్ష నేత సిద్ద రామయ్య మండిపడుతున్నారు. వరుస పెట్టి తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాల్ని పక్కన పెట్టేయటంపై కన్నెర్ర చేసిన ఆయన.. ప్రభుత్వం తన తీరును మార్చుకోకుంటే రోడ్లమీదకు వచ్చి నిరసన చేయాల్సి ఉంటుందన్నారు. మరి.. ఈ వ్యవహారం ఎక్కడి వరకూ వెళుతుందో చూడాలి.