అందరికీ నచ్చే మాట చెప్పిన జగన్

May 25, 2020

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈరోజు శుభదినం అనుకోవాలి. నిన్న శాసన సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తవడంతో సభ కొలువుతీరింది. వారంతా కలిసి స్పీకర్ గా తమ్మినేని సీతారాంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫ్లోర్ లీడర్ హోదాలో ఆయన్ను అభినందించారు. స్పీకర్ ఎన్నిక అనంతరం తొలిసారిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా జగన్ అందరికీ  గుర్తుండిపోయే మాటలు చెప్పారు. ఈ విషయంలో జగన్ ను అభినందించాల్సిందే. 

 ఇకపై ఏపీ అసెంబ్లీలో ఫిరాయింపులు అనే పదం వినపడదని జగన్ స్పస్టంగా చెబుతూ... ఒకపార్టీ గుర్తుపై గెలిచి ఇంకో పార్టీ సభ్యుడిగా అసెంబ్లీలో కొనసాగే దుర్మార్గమైన పరిస్థితిని మరోసారి సభలో కనిపించబోనని అన్నారు. అలాంటి సభను నేను చూడలేనని, అందుకే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోనందుకు నిరసనగా గతంలో సభను బహిష్కరించామన్నారు.

బ్యూటీ ఆఫ్ డెమోక్రసీని ఈ చట్ట సభలో మళ్లీ చూపిస్తానని జగన్ స్పష్టం చేయడం చాలా మంచి విషయం. ఈ మాట ఐదేళ్లు నిలబెట్టుకోవాలి. రేపటి రోజున జగన్ పార్టీలోకి ఇతర పార్టీ సభ్యులు ఫిరాయించకపోయినా, బీజేపీలోకి తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఫిరాయించినా ఆరోజు కూడా ఇదేమాటకు కట్టుబడి ఉండాలి. ఫిరాయించిన వారిని చట్టం ప్రకారం సభ్యత్వం రద్దు చేయాలి. ఇది చేయలగరా జగన్? అపుడు కూడా ఇదే మాట మీద నిలబడితే మిమ్మల్ని అధిగమించే లీడర్ లేనట్టే ప్రజలు భావిస్తారు.  

టెండర్ల వ్యవస్థలోనూ, గ్రామస్థాయిలోనూ, ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతిని తొలగించి, విలువలు, విశ్వసనీయతకు రాష్ట్రాన్ని కేరాఫ్ అడ్రస్ గా చేసి చూపిస్తానని జగన్ మరో వ్యాఖ్య చేశారు. మొదటి రోజునుంచే దీని కోసం కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నట్టు జగన్ చెప్పారు. అందుకే నిజాయితీగల తమ్మినేనిని స్పీకర్ గా ప్రకటించామని జగన్ తెలిపారు.