వైఎస్ లో ఉన్నది జగన్ లో లేనిది

May 26, 2020

ప్రతి కొడుకు తండ్రికి వారసుడు కాలేడు. ఎందుకంటే లక్షణాలు వేరు, వారసత్వం వేరు. బహుశా జగన్ విషయంలో ఇదే జరిగినట్టు ఉంది. ఇప్పటికి ఎన్నో సార్లు వైఎస్ వేరే... జగన్ వేరు అన్నట్లు జగన్ ప్రవర్తించాడు. వైఎస్ ను అభిమానించే వాళ్లు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలోనే ఉంటారు. సైద్ధాంతికంగా వైఎస్ ను ఏ మాత్రం ఆమోదించ‌ని వారు సైతం వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న్ను త‌మ స‌న్నిహితుడి ఫీల్ అవుతుంటారు. పార్టీలకు అతీతంగా వైఎస్ ను వ్య‌క్తిగ‌తంగా అభిమానించి.. ఆరాధించే వారెంద‌రో.
మ‌ర‌ణం త‌ర్వాత ఇంకా వైఎస్ అందరికీ గుర్తున్నాడంటే దీనికి ఆయ‌న‌లో ఉన్న ఒక లక్షణం ప్రధాన కారణం. ఎమోష‌నల్ గా వైఎస్ అంద‌రికి క‌నెక్ట్ అవుతారు. కొన్ని విష‌యాల్లో ఆయ‌న పొర‌పాట్లు.. త‌ప్పులు చేసినా.. త‌న ఇంటికి వ‌చ్చిన శ‌త్రువును సైతం ఆద‌రించి అభిమానించే మంచి గుణం వైఎస్ లో క‌నిపిస్తుంది. కొన్ని విష‌యాల‌కు రాజ‌కీయాలు అక్క‌ర్లేద‌నే ఆయ‌న తీరు చాలా అరుదుగా క‌నిపిస్తుంది. అందుకే వైఎస్ మరణించినపుడు చంద్రబాబు చాలా బాధపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో వైఎస్ ఎలాంటి ముద్ర వేయలేకపోయారు గానీ ప్ర‌జ‌లతో భావోద్వేగ సంబంధాన్ని బిల్డ్ చేసేలా చక్కటి సంక్షేమ పథకాలు పెట్టారు. అందుకే త‌న‌ను అభిమానించే వారు..ఆరాధించే వారు మాత్ర‌మే కాదు.. సాయం కోసం ఆశ‌గా త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే వారిని నిరాశ‌కు గురి చేయ‌టం వైఎస్ కు అస్స‌లు ఇష్టం ఉండ‌దు. ఇది టీడీపీ వాళ్ల నోటి నుంచి కూడా పలుసార్లు విని ఉంటాం. 

మ‌రి.. అలాంటి నేత కొడుకైన జ‌గ‌న్.. త‌న తండ్రికి సంబంధించిన కొన్ని విష‌యాలు మిస్ అవుతున్నారా? అంటే అవున‌న్న మాట వినిపిస్తోంది. తాను చేసే సాయం గురించి బ‌య‌ట‌కు రావ‌టానికి పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌ని జ‌గ‌న్‌.. కొన్ని సంద‌ర్భాల్లో సాయం కోసం వ‌చ్చే వారిని ఉద్దేశించి చేసే వ్యాఖ్య‌లు ఆయ‌న‌కు డ్యామేజింగ్ గా మారుతున్నాయ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
తాజాగా పులివెందుల ప్ర‌జాద‌ర్బార్ కు వ‌చ్చిన మ‌హిళ‌.. త‌న బిడ్డ‌కు వైద్య‌సాయం కోసం వ‌స్తే.. రెండు వారాల త‌ర్వాత ర‌మ్మ‌ని చెప్ప‌టం ఇలాంటిదే. అదే ప్లేస్ లో వైఎస్ ఉంటే.. ఎవ‌రో ఒక నేత‌కు ఆమె సంగ‌తి చూసి.. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని ఆదేశించేవారు. ఒక‌సారి ఆయ‌న నోటి నుంచి మాట వ‌స్తే.. ఇక ఆ ప‌ని జ‌రిగిపోవాల్సిందే. జ‌గ‌న్ కూడా స‌మ‌స్య‌ల విష‌యంలో సానుకూలంగా స్పందిస్తార‌ని చెబుతారు. కానీ.. అలాంటి తీరు త‌న తండ్రి మాదిరి ఉండాల‌న్న ఆశ ప‌లువురిలో వ్య‌క్త‌మ‌వుతోంది. త‌న తండ్రే అయినా.. రాజ‌కీయంగా ఆయ‌న తీరు ఎలా ఉంటుంద‌న్న విష‌యాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా.. భావోద్వేగంతో చెప్పిన యాత్ర మూవీని జ‌గ‌న్ ఒక్క‌సారి చూస్తే మంచిద‌ని చెప్పాలి. జ‌గ‌న్ కు సంబంధించి కొన్ని విష‌యాల్లో జ‌ర‌గాల్సిన అప్ డేట్స్.. ఆ సినిమా చూసేట‌ప్పుడు అటోమేటిక్ జ‌రిగిపోయే అవ‌కాశం ఉంది. మ‌రి.. జ‌గ‌న్ ఆ ప‌ని చేస్తారా?