ఆ మాటతో... జగన్ తెలంగాణ టూర్ క్యాన్సిలైనట్లే

July 05, 2020

మ‌రో ఐదు రోజుల్లో కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించాల‌ని భావిస్తున్నారు కేసీఆర్‌. కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణం ఒక చరిత్ర‌గా.. దాన్ని నిర్మించిన త‌మ ప్ర‌భుత్వం సాధించిన అపూర్వ విజ‌యంగా చాటి చెప్పుకోవాల‌ని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్ప‌టికే ఆయ‌న ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు.
ప్ర‌ధాని మోడీతో పాటు.. మ‌హారాష్ట్ర.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రుల‌ను పిల‌వాల‌ని డిసైడ్ కావ‌టం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో పిలుపుల కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేశారు కూడా. ఇదిలా ఉంటే.. కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి జ‌గ‌న్ రావొద్ద‌ని.. వ‌స్తే.. ఏ మాత్రం బాగోదంటూ తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు. జ‌గ‌న్ ఎందుకు రాకూడ‌దో వారు వివ‌రిస్తున్నారు.
వైఎస్ సిద్ధం చేసిన ప్రాజెక్టు పేరు మార్చి.. డిజైడ్ లో మార్పులు చేసి కాళేశ్వ‌రం ప్రాజెక్టును చేప‌ట్టార‌ని.. ఇందులో భాగంగా వైఎస్ మీద గ‌తంలో దారుణ వ్యాఖ్య‌లు చేశారంటూ గ‌తాన్ని గుర్తు చేస్తున్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభానికి జ‌గ‌న్ వ‌స్తే.. వైఎస్ కు అవ‌మానించిన‌ట్లు అవుతుంద‌ని ఒక‌రంటే.. తాజాగా ఒక అడుగు ముందుకేసి సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క ఏకంగా లేఖ రాసేశారు. తెలంగాణ‌లో నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి ఆయ‌న హాజ‌రు కాకూడ‌ద‌ని కోరారు.
కాళేశ్వ‌రం ఓపెనింగ్ కు వ‌స్తే వైఎస్ ఆత్మ క్షోభిస్తుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. టెండ‌ర్ల వివ‌రాలు.. జ్యుడిషియ‌ల్ క‌మిష‌న్ ముందు పెడ‌తామ‌న్న జ‌గ‌న్ నిర్ణ‌యం బాగుంద‌ని.. తెలంగాణ‌లోనూ ఇదే త‌ర‌హాలో టెండ‌ర్ల వివ‌రాల్ని జ్యుడీషియ‌ల్ క‌మిష‌న్ ముందు ఉంచాల‌ని కోరారు.
కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి హాజ‌రైతే.. ఈ ప్రాజెక్టు ఆకృతి మార్పు.. అవ‌క‌త‌వ‌క‌ల‌కు వైఎస్ జ‌గ‌న్ ప‌రోక్షంగా బాధ్యులు అవుతార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ఒక్కొక్క‌రుగా కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి రావొద్ద‌ని కోరటం ఒక ఎత్తు.. త‌న తండ్రి విష‌యాన్ని తెర మీద‌కు తీసుకురావ‌టం మ‌రో ఎత్తు. ఇలాంటి వేళ‌.. జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.