మోదీ మార్క్ స్ట్రోక్... వైఎస్ విజయమ్మ ట్రస్ట్ పై నిషేధం

January 26, 2020

కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ సాగుతోంది. తాజాగా మోదీ సర్కారు తీసుకున్న ఓ సంచలన నిర్ణయం ఏపీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి, ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పేరిట ఉన్న ట్రస్ట్... వైఎస్ విజయమ్మ చారిటబుల్ ట్రస్ట్ పై మోదీ సర్కారు నిషేధం విధించేసింది. ట్రస్ట్ ను ఏర్పాటు చేసిన విజయమ్మ... తన ట్రస్ట్ కు విదేశాల నుంచి అందుతున్న నిధులు, వాటిని ఖర్చు చేసిన వైనంపై వార్షిక నివేదికలు ఇవ్వని కారణంగానే ఈ నిషేధం విధిస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. 

ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైసీపీకి గౌరవాధ్యక్షురాలిగా ఉన్న ఉన్న విజయమ్మ... తన ట్రస్ట్ ఆదాయ వ్యయాలను కేంద్రానికి సమర్పించాల్సిన బాధ్యతను ఎలా మరిచారన్న విషయంపై ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర లేసింది. ఇదిలా ఉంటే... విజయమ్మ చారిటబుల్ ట్రస్ట్ తో పాటుగా ఏపీకి చెందిన సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎంపీ, ప్రస్తుతం టీడీపీ నేతగా ఉన్న రాయపాటి సాంబశివరావు పేరిట కొనసాగుతున్న రాయపాటి చారిటబుల్ ట్రస్ట్ పైనా కేంద్రం నిషేధం విధించింది. ఈ ట్రస్ట్ పై నిషేధానికి కూడా ఆదాయ వ్యయాలు సమర్పించకపోవడమేనని కేంద్రం తెలిపింది. 

విజయమ్మ చారిటబుల్ ట్రస్ట్, రాయపాటి చారిటబుల్ ట్రస్ట్ లతో పాటు ఏపీకి చెందిన 168 ట్రస్ట్ లపైనా కేంద్రం నిషేధం విధించింది. వీటిలో రూరల్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్ మెంట్ సొసైటీ, ఫిలడెల్ఫియా జియాన్ మినిస్ట్రీస్, అరుణ మహిళా మండలి తదితర సంస్థలున్నాయి. ఇక తెలంగాణకు చెందతిన సేవా భారతి, హైదరాబాద్ ఆర్క్‌డియోసీజ్ ఎడ్యుకేషనల్ సొసైటీ, సత్యహరిశ్చంద్రఫౌండేషన్ సహా 90 ట్రస్టులపైనా కేంద్రం నిషేధం విధించింది.