జగన్ కి నమ్మినబంటు నుంచి పొంచి ఉన్న ముప్పు

August 15, 2020

విజయసాయిరెడ్డి కార్యకలాపాలు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయా? అంటే అవును అనే సమాధానమే వస్తోంది. సాయిరెడ్డి వ్యూహంలో చిక్కుకుని జగన్ బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నట్టు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అందుకే ఎవరి మాట వినని జగన్ సాయిరెడ్డి మాట వింటారు. అందుకే జగన్ ఆలోచనలకు విరుద్ధంగా విజయసాయిరెడ్డికి వైకాపాలో 5 పదవులున్నాయి. పైగా ఏపీలో ఉన్న నెం.1 సిటీతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సాయిరెడ్డి ఇన్ ఛార్జి. ఇది ఇప్పటి నుంచి కాదు... కొన్నేళ్లుగా ఆయనే ఆ కార్యకలాపాలన్నీ చూసుకుంటున్నారు. దీని వెనుక పెద్ద వ్యూహమే ఉంది అంటున్నారు. 

ఎన్నికలు ముందు, ఎన్నికల తర్వాత ఆరు నెలలు... జగన్ పేరు తప్ప సాయిరెడ్డి ఇంకో మాట మాట్లాడేవాడు కాదు. కానీ... కొంతకాలంగా జగన్ పేరు తలుస్తున్నా... అది డబ్బా కొట్టినట్లు చెబుతున్నాడే గాని జగన్ విలువను పెంచేదిగా లేదు. మరోవైపు తన మనిషి అయిన కె.చంద్రమౌళి ని ముందు పెట్టి ప్రగతి భారత్ ఫౌండేషన్ ప్రారంభించారు సాయిరెడ్డి. సరిగ్గా 6 నెలల క్రితం మొదలైంది. సాధారణంగా ఎవరైనా స్వచ్ఛంద సంస్థ ప్రారంభిస్తే... వాళ్లు చేసే కార్యక్రమాల మీద రాజకీయ నాయకుల ఫొటోలు ముద్రించరు. కానీ ఈ ఫౌండేషన్ చేసే కరోనా సాయంలో ప్రతి ప్యాక్ మీద సాయిరెడ్డి ఫొటో ముద్రిస్తోంది. ఎక్కడా మచ్చుకు కూడా జగన్ ఫొటో కనపడటం లేదు. 

మరోవైపు మనం పైన చెప్పుకున్నట్టు ఉత్తరాంధ్రకు సాయిరెడ్డి ఇన్ ఛార్జి. ఇది జగన్ నిర్ణయించింది కాదు. సాయిరెడ్డి ఎంచుకున్నది. ఈ వ్యూహం వెనుక బీజేపీ ఉంది. బీజేపీ ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో కొంచెం బలంగా ఉంది. ఉత్తరాంధ్రకు బాధ్యతలు వహిస్తూనే... గోదావరి జిల్లా నేతలను చెప్పు చేతల్లో పెట్టుకోవడం ద్వారా అక్కడ తన వర్గాన్ని సాయిరెడ్డి బలోపేతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ కూడా బలపడుతుంది. దానికి అవసరమైన కార్యక్రమాలు సాయిరెడ్డి చాప కింద నీరులా చేసుకుంటూ పోతాడు. మీరు గమనిస్తే ఇంతవరకు బీజేపీ గెలిచిన సీట్లు అన్నీ కూడా ఈ జిల్లాల్లోనే ఉన్నాయి. అందుకే బీజేపీ దృష్టికూడా ఆ ప్రాంతం మీదనే ఉంది. వైజాగ్ లో బీజేపీ హవా చాలా ఎక్కువ. ముందు ఇక్క గ్రామం స్థాయిలో బీజేపీని బలోపేతం చేసుకోవడం ఒకవైపు జరుగుతుంది. అలాగే సాయిరెడ్డి తన వర్గాన్ని బలోపేతం చేసుకుంటూ ఉంటారు. వన్ ఫైన్ మార్నింగ్ జగన్ పై తిరుగుబాటుకు జెండా ఎగరేస్తారు.

సాయిరెడ్డి- బీజేపీకి సంబంధాలు ఎలా ఉన్నాయో చెప్పడానికి ఇంకో ఉదాహరణ చర్చించుకుందాం. సాయిరెడ్డి తనకు నచ్చినపుడల్లా పీఎంను, హోంమంత్రిని కలుస్తున్నారు. మరి సాయిరెడ్డికి ఈజీగా దొరికిన అపాయింట్ మెంట్ జగన్ కు ఎందుకు దొరకడం లేదో ఆలోచించండి. తనకు తెచ్చుకోగలిగిన వాడు సీఎం అయిన జగన్ కి తేలేకపోతున్నాడా. అనేక సార్లు పీఎం, హోం శాఖ జగన్ కి అపాయింట్ మెంట్ తిరస్కరించాయి. సాయిరెడ్డికి అపాయింట్ మెంట్  ఇచ్చి జగన్ కి ఈయకపోవడం అనే పాయింట్ ను గమనించాలి ఇక్కడ. బీజేపీ దృష్టిలో జగన్ - సాయిరెడ్డి ఒకటి కాదు.

వాస్తవానికి ఏం జరుగుతుంటే... బీజేపీ చేతిలో సాయిరెడ్డి పావు. సింధియా పార్టీలో చేరితో ఒక్కరోజులు కేసులన్నీ కొట్టేశారు. మరి అంత శక్తిమంతమైన బీజేపీ సాయిరెడ్డి కేసులను కొట్టేయలేదు. జగన్ తో లింకు ఉండటమే దీనికి కారణం. సాయిరెడ్డి మీద ఏ కేసు కొట్టేయాలన్నా జగన్ మీద కూడా కొట్టేయాలి. అందుకే ఈ కాంప్లికేషన్ వల్ల కేవలం కేసులు స్తబ్దుగా ఉంచారు. పైగా ఇలా కేసులు స్తబ్దుగా ఉంచడం కూడా బీజేపీకి పనికొచ్చే విషయమే. సాయిరెడ్డి ద్వారా పార్టీని చీల్చడం బీజేపీ వ్యూహం. బీజేపీ అండ గట్టిగా ఉండటం వల్లే కన్నా వంటి వారిపై సాయిరెడ్డి ధైర్యం విరుచుకుపడుతున్నారు. పార్టీ నిజంగా బలపడుతుంది అనుకుంటే ఏపీని మరోసారి చీల్చడానికి కూడా బీజేపీ వెనుకాడదు.  అయితే... ఇపుడు సాయి పునాదులు బలంగా నిర్మించుకుంటున్నారు. మెల్లగా జగన్ పేరును తగ్గిస్తున్నారు. పార్టీలో తానేం తలచుకున్న జరుగుతుందని పార్టీ నేతలకు సంకేతాలు పంపుతున్నారు. అందకే సాయిరెడ్డి జగన్ కంటే బిజీగా ఉంటారు. జగన్ అపాయింట్ మెంట్ దొరికినంత సులువుగా సాయిరెడ్డి అపాయింట్ మెంట్ దొరకదు. అయితే. ఇదంతా కూడా 2021 నుంచి మొదలయ్యే వ్యవహారం. భవిష్యత్తులో వై కాస్తా వి అవుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ కాస్తా వీఎస్సార్ కాంగ్రెస్ అవుతుంది. 

కొసమెరుపు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని తిడుతుంటే... స్టేట్ ఇన్ ఛార్జిలు ఒక్కమాట కూడా సాయిరెడ్డిని ఏమీ అనలేదు. గమనించారా?