లోట‌స్‌పాండ్‌కు జ‌గ‌న్ బైబై...ఎందుకంటే...

May 24, 2020

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌త కొద్దికాలంగా త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌కు చెక్ పెట్టేందుకు ఆయ‌న సిద్ధ‌మ‌వుతున్నారు. ప్ర‌ధానంగా ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న జ‌గ‌న్‌ ఇందుకు త‌గ్గ నిర్ణ‌యం తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్యాల‌యంను అమ‌రావ‌తికి త‌ర‌లించారు. ఈ మేర‌కు కార్యాచ‌ర‌ణ కూడా మొద‌లుపెట్టేశారు.

ఇప్పుటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే కేరాఫ్ లోటస్ పాండ్. అక్కడే పార్టీ ప్రధాన కార్యాలయం ఉంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో హైద‌రాబాద్ నుంచి వ‌చ్చే... రాబోయే ఫ‌లితాలు ఎలా ఉన్నా మరో ఐదేళ్లు హైదరాబాద్ లోనే జగన్ ఉంటారనే ఆరోపణలు వచ్చాయి. వీటికి చెక్ పెడుతూ.. పార్టీ ప్రధాన కార్యాలయంతోపాటు నిర్వహణను కూడా ఫలితాలకు ముందే అమరావతికి మార్చేందుకు జ‌గ‌న్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఆఫీస్ మొత్తాన్ని తాడేపల్లికి షిఫ్ట్ చేయటంతోపాటు.. మే 19వ తేదీ నుంచి పూర్తి స్థాయి వ్యవహారాలను తాడేపల్లిలోని పార్టీ ఆఫీస్ నుంచే నిర్వహించనున్నారు. అన్ని విభాగాలతోపాటు సోషల్ మీడియా వింగ్ కూడా తాడేపల్లికి మారిపోయింది.

ఈనెల 23వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి. అందుకు రెండు రోజుల ముందు నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున మే 21వ తేదీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో జ‌గ‌న్‌ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ రోజు నుంచే జగన్ పూర్తిస్థాయిలో రాజకీయ వ్యవహారాలను అమరావతి నుంచే నిర్వహించనున్నారు. పార్టీ కార్యాల‌యం మార్పు వైసీపీకి ఎలా క‌లిసి వ‌స్తుందో వేచి చూడాలి మ‌రి.