లోకేష్ ని వైఎస్, కేటీఆర్ ను బాబు మంత్రులను చేశారట

February 25, 2020

కొడాలి నాని లోకేష్ కి గిఫ్ట్ ఇవ్వడం ఏంటి?  అనుకుంటున్నారా? గిఫ్ట్ అంటే... లోకేష్ కు తెలియని ఒక రహస్యం ఒకటి ఆయనకు పుట్టిన రోజు సందర్భంగా నాని చెప్పాడు. ఆ రహస్యం ఏంటంటే... లోకేష్ ని మంత్రిని చేసింది చంద్రబాబు అని అందరూ అనుకుంటూ ఉంటే... కాదు కాదు వైఎస్ అని రాజకోట రహస్యాన్ని వెల్లడించారు కొడాలి నాని. అంతా కన్ఫ్యూజన్ గా ఉంది కదా. 

ఒకరకంగా చెప్పాలంటే నారా లోకేశ్ కు రాజకీయ భిక్ష పెట్టింది దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డే.  నాడు ఎన్టీఆర్ హయాంలో శాసనమండలిని రద్దు చేశారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కౌన్సిల్ ను మళ్లీ తీసుకొచ్చారు. వైఎస్ కనుక కౌన్సిల్ ను తిరిగి ఏర్పాటు చేయకపోతే నారా లోకేశ్ అనే వ్యక్తి ఎమ్మెల్సీ అవుతాడా? మంత్రి అయ్యేవాడా?  ఇది కొడాలి నాని లాజిక్. 

కొడాలి లాజిక్ ప్రకారం... లోకేష్ కు రాజకీయ బిక్ష పెట్టింది వైఎస్ అనుకుంటే... తెలుగు వారికి ఐటీ బిక్ష పెట్టింది చంద్రబాబే. ఈరోజు తెలంగాణ ఖజానాలో కాసుల గలగలలకు కారణం చంద్రబాబే. కేటీఆర్ మంత్రి కావడానికి కారణం కూడా చంద్రబాబే. ఇది కొడాలి నాని లాజిక్కే. చంద్రబాబు మైక్రోసాఫ్ట్ ను హైదరాబాదుకు తెచ్చాడు కాబట్టి ఐటీ ఇక్కడ డెవలప్ అయ్యింది కాబట్టి తెలుగు వారికి వచ్చే ప్రతి ఐటీ ఉద్యోగినికి చంద్రబాబు కారణం అనుకోవాలి. అలాగే సైబరాబాద్ డెవలప్ అవడం వల్ల తెలంగాణ ఖజానా నిండింది కాబట్టి దానికి కారణం చంద్రబాబే. ఇక కేసీఆర్ కు మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల కేసీఆర్ వేరే పార్టీ పెట్టాడు, ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి కేటీఆర్ మంత్రి కావడానికి కారణం కూడా చంద్రబాబే. 

లోకేష్ కి మంత్రిని చేసిన క్రెడిట్ వైఎస్ కి ఇస్తే... కేటీఆర్ ను మంత్రిని చేసిన క్రెడిట్ చంద్రబాబుకు ఇవ్వడంలో రాంగేముంది? కొడాలి నాని లాజిక్ ప్రకారం అంతే కదా.