జగన్ గెలిచినా.. ఓడినట్లే !

June 02, 2020

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీ నేతలు ఎంతకైనా తెగిస్తున్నారా? 10 నెలల కాలంలోనే ప్రజలు తమపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని జగన్ అనూయయులు గుర్తించారా? గెలుపు కోసం అవసరమైతే మరోసారి ఫ్యాక్షనిజాన్ని గుర్తుకు వచ్చేలా విపక్షాలపై దాడులకు దిగుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు. రాష్ట్రంలో అసలు పోలీసులు, ఎన్నికల కమిషన్, చట్టాలు ఉన్నాయా, ఉంటే అవి అధికార పార్టీకి చుట్టాలుగా మారాయని దుయ్యబడుతున్నారు.

ఏపీలో 10 వేలకు పైగా ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 9వేలకు పైగా స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 660 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. టీడీపీ వందలాది ఎంపీటీసీ, పదికి పైగా జెడ్పీటీసీ స్థానాల్లో నామినేషన్ వేయలేకపోయింది. దీనికి వైసీపీ నేతల దౌర్జన్యకాండ కారణమని ఆరోపిస్తున్నారు. నేటితో పూర్తయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ ప్రక్రియ మొదటి నుండి ఉద్రిక్తంగానే మారింది.

అధికారంలోకి వచ్చింది మొదలు కేవలం టీడీపీపై కక్ష సాధింపు ధోరణితోనే వ్యవహరిస్తున్న వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, వైసీపీ కూడా దీనిని గుర్తించిందని చెబుతున్నారు. అందుకే స్థానిక ఎన్నికల్లో ప్రజామద్దతుతో గెలవలేమని భావించి నిర్బంధం, దౌర్జన్యం, దాడులతో విపక్ష నేతలను బెదిరించి, నామినేషన్లకు దూరంగా ఉంచడం లేదా ప్రచారానికి దూరంగా ఉంచే దారుణచర్యలకు పాల్పడుతున్నాయనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.

పలుచోట్ల టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు నామినేషన్లు వేయకుండా వైసీపీ నాయకులు అడ్డుకున్నారని ఆయా పార్టీల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాడులపై బీజేపీ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. వైసీపీ రౌడీ పార్టీలా వ్యవహరిస్తోందని, చేతిలోని నామినేషన్ పత్రాలను లాక్కొని చించేస్తున్నారని బీజేపీ నేత సునీల్ ధియోదర్ తీవ్ర ఆరోపణలు చేశారు. పుంగనూరులో టీడీపీ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా రణరంగం సృష్టించారు. తిరుపతిలో నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన టీడీపీ నేతలు లోపలకు రాకుండా గేట్లు మూసి వైసీపీ దౌర్జన్యానానికి దిగిందని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు.

రెండు రోజుల క్రితం బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై వైసీపీ దాడులు చేసిన విషయం తెలిసిందే. తాడిపత్రిలోను మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డిపై దాడికి యత్నించారు. ప్రజాగ్రహం గుర్తించిన వైసీపీ కేవలం బెదిరింపులు, దౌర్జన్యంతో విపక్షాలను కట్టడి చేయాలని చూస్తోందని, ఓ మహిళపట్ల వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు.

ఓ మహిళ నామినేషన్ పత్రాలను తన జాకెట్లో పెట్టుకొని నామినేషన్ వేసేందుకు వెళ్తున్నారు. దీనిని గుర్తించిన వైసీపీ కేడర్ ఆమె నుండి నామినేషన్ పత్రాలను లాక్కునేందుకు ప్రయత్నించారని చెబుతున్నారు. మహిళ పట్ల అధికార పార్టీ వారి తీరు మీద ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. దౌర్జన్యంతో పాటు నామినేషన్ వేయకుండా మహిళల పట్ల కూడా అభ్యంతరకరంగా ప్రవర్తించడం ఏమిటని, ఇలాంటి సమాజంలో ఉన్నందుకు సిగ్గుగా ఉందని, హుందాగా వేయాల్సిన నామినేషన్‌ను ఓ మహిళ జాకెట్లో పెట్టుకొని తీసుకు రావాల్సిన పరిస్థితికి అధికార పార్టీ తీసుకు వచ్చిందంటున్నారు. అలాంటి మహిళకు కూడా రక్షణ లేకుండా పోయిందని, నియంత పాలన సాగుతోందని ఆరోపిస్తున్నారు. ఈ రోజు నామినేషన్ వేసేందుకు ఓ మహిళకు జరిగిన అన్యాయం రేపు మరో మహిళకు జరగదని గ్యారెంటీ ఏమిటని నిలదీస్తున్నారు. భయానక పరిస్థితులు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినా.. ఇంతటి దారుణాలు చూశాక... ఆ గెలుపు ఓ గెలుపే కాదని, ఓడినట్లేననేది ప్రజల మాట.

అనూహ్యంగా 151 సీట్లు సాధించిన వైసీపీ, అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు చేసిందేమీ లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గెలుపు కోసం దాడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ నాయకులు ప్రతిచోట చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే పోలీసులు, ఈసీ చేష్టలుడిగి చూస్తోందని, జగన్ సూపర్ ఈసీ అయ్యారని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.