బీజేపీకి తత్వం బోధపడిందా? 

June 02, 2020

2014లో తనతో కలసి వచ్చిన బీజేపీకి పొత్తు న్యాయం పాటించి పదవులు అప్పగించారు చంద్రబాబు. కానీ అనంతరం కొంతకాలానికి పొత్తు న్యాయం పక్కనపెట్టి మెల్లగా వైసీపీని చేరదీయడం మొదలుపెట్టింది. వైసీపీ నేతలు బీజేపీకి సాష్టాంగ నమస్కారాలు చేసి ఎక్కడ లేని వినయాన్ని ప్రదర్శించి వారిచేయి మా భుజాన్ని తాకితే చాలు అంటూ మురిసిపోయారు. దీంతో బీజేపీ మెల్లగా వైసీపీ మాయలో పడిపోయింది. చంద్రబాబును దూరం చేసుకుంది. పనికిమాలిన ఇగోకి పోయి చంద్రబాబును రెచ్చగొట్టింది. ఒక బలమైన ప్రాంతీయ పార్టీ నాయకుడు అయిన చంద్రబాబు కూడా పెద్దలతో మాట్లాడుకుండా ఇగోకు పోయి అవసరానికి మించిన బలప్రదర్శన చేశారు. ఇలా ఇద్దరి ఇగోతో బీజేపీ టీడీపీ బంధం తెగిపోయింది. అడుగడుగునా వైసీపీ అబద్ధాలను గట్టిగా నమ్మి వాటిని బీజేపీ కూడా ప్రచారం చేసి చంద్రబాబు క్రెడిబులిటీని దెబ్బతీసింది. ఫలితం అన్ని పథకాలు ఇచ్చి, అభివృద్ధి పనులు చేసినా తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కట్ చేస్తే... ఇది అరాచక పాలన అంటూ దగ్గరుండి గెలిపించిన బీజేపీయే ఇపుడు వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోంది. అంటే బీజేపీకి తత్వం బోధపడినట్లే కదా. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో బీజేపీ అభ్యర్థి చేయి నరికేశారు వైసీపీ నేతలు. మరోచోట జనసేనపై దాడిచేశారు. మాచర్లలో రాష్ట్రం విస్తుపోయేలా హోంమంత్రి అనుచరుడే బోండా ఉమ, బుద్ధా వెంకన్న కారుపై క్రూరంగా దాడి చేశారు. హత్యయత్నానికి పాల్పడ్డారు. ఏపీలో ఆటవిక పాలన నడుస్తుందనడానికి పట్టపగలు జరిగిన ఈ దారుణాలే ప్రత్యక్ష ఉదాహరణలు.  
’’స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పక్షపాతంగా జరపడానికి వైసీపీ ఎందుకు భయపడుతోంది? పోటీ చేసే అభ్యర్థిలపై దాడులు,వైసీపీ కాని వారికి సర్టిఫికెట్లు జారీ చేయడంలో నిర్లక్ష్యం,తప్పుడు కేసులతో భయబ్రాంతులకు గురిచేయడం,గ్రామ వాలంటరీ వ్యవస్థ దుర్వినియోగంచూస్తుంటే వైసీపీ అభద్రతా భావం అర్ధమవుతోంది’’ అంటూ తాము అండగా నిలిచిన ప్రభుత్వంపై కన్నా చేసినా ఆరోపణలు ఇవి. వైసీపీ పాలన వస్తే రాష్ట్రం ఎలా ఉంటుందని ప్రచారం జరిగిందో అలానే ఉందని పలువురు కామెంట్ చేయడం గమనార్హం. ఇంతకాలానికి తాము ఎంత ప్పు చేశామో బీజేపీకి అర్థమైంది. అసమర్థుల చేతుల్లో పాలన నడుస్తోందని, ప్రజాస్వామ్యానికి రక్షణ లేకుండా పోయిందని బీజేపీ బాధపడుతోంది. అంతా చేసి ఇపుడు బాధపడితే ఏంలాభం. చేసిన ప్రతి అరాచకానికి అండగా నిలుస్తూ... ఏకంగా కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసే రాజధానిని నాశనం చేస్తున్నా ప్రేక్షకపాత్ర వహిస్తున్న బీజేపీకి ఇప్పటికైనా జ్జానోదయం అవడం మంచిదే.