హోం మంత్రి సుచరితకు వైసీపీ కార్యకర్తల షాక్

June 03, 2020

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో ఏపీ సీఎం జగన్ తీవ్ర అసహనంతో ఉన్న సంగతి తెలిసిందే. ఈసీ ఏకపక్షంగా వ్యవహరించి ఎన్నికలు వాయిదా వేసిందని జగన్ ఆరోపించారు. ఇక, ఈ వ్యవహారంపై సుప్రీం తలుపు తట్టిన జగన్ కు తాత్కాలికంగా నిరాశ ఎదురైంది. ఈ రోజు లిస్ట్ అయిన పిటిషన్లలో ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ లేకపోవడందో జగన్ సర్కార్ కు చుక్కెదురైంది. దీనికితోడు, తాజాగా స్థానిక సంస్థలలో టికెట్ల పంచాయితీ జగన్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. బంధువులెవరికీ టికెట్లు ఇవ్వవద్దంటూ జగన్ జారీ చేసిన ఆదేశాలను కొందరు వైసీపీ నేతలు తుంగలో తొక్కడంతో జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి...తన బంధువుకు టికెట్ ఇచ్చిన పంచాయితీ జగన్ దగ్గరకు చేరింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ టికెట్ల సెగ ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరితకు తగిలింది. టికెట్ల పంచాయితీ నేపథ్యంలో సొంతపార్టీకి చెందిన కార్యకర్తలే సుచరిత ఇంటిని ముట్టడించారు. 

స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాపడ్డప్పటికీ...టికెట్ల పంచాయితీ రగులుతూనే ఉంది. తాజాగా 27వ డివిజన్ టికెట్ ను రౌడీషీటర్, కబ్జాదారుడైన వ్యక్తికి ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేపిన వైసీపీ కార్యకర్తలు...సుచరిత ఇంటిని ముట్టడించారు. టికెట్ల పంపకాల విషయంలో సీఎం జగన్త్ర ఆదేశాలు క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదంటూ వైసీపీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. 27వ డివిజన్ టికెట్ ను యోగేశ్వర్ రెడ్డికి ఇవ్వాలని, పార్టీ కోసం యోగేశ్వర్ ఎంతో కష్టపడ్డారని వారు  డిమాండ్ చేశారు. భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు హోంమంత్రి ఇంటిని ముట్టడించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో, పరిస్థితిని అదుపు చేసేందుకు అక్కడకు భారీ సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు, నేతల్లోని అంతర్గత విభేదాలు...కుమ్ములాటలు బయటకు రావడంపై జగన్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.