​ఛార్టర్డ్ ఫ్లైటులో వెళ్లి రాజుగారిపై ఫిర్యాదు

August 14, 2020

చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కి పెట్టుబడులు తేవడం కోసం అధికారులతో ఫ్లైటు తీసుకుని విదేశాలకు వెళ్తే చార్టర్డ్ ఫ్లైటులో వెళ్తారా అని ఆనాడు వైసీపీ ప్రశ్నించింది. ఇపుడు వైసీపీ... ఒక ఎంపీపై ఫిర్యాదు చేయడానికి చార్టర్డ్ ఫ్లైటులో ఢిల్లీ వెళ్లింది. విజయసాయిరెడ్డి నేతృత్వంలో స్పీకరు ఓం బిర్లాను కలిసిన కలిసిన వైసీపీ ఎంపీలు తమ పార్టీని ధిక్కరించిన ఎంపీపై అనర్హత వేటు వేయమని  రఘురామరాజుపై  స్పీకరుకు ఫిర్యాదు చేశారు. స్పీకరు సానుకూలంగా స్పందించినట్లు విజయసాయిరెడ్డి మీడియాకు వెల్లడించారు.

ఈ విషయాలను మీడియాకు వెల్లడించే సమయంలో రఘురామరాజు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ ని ఎలా అవమానించింది మరోసారి మీడియాకు తెలుగులో, ఇంగ్లిష్ లో పదేపదే వివరించారు. ఆయన మా అధ్యక్షుడిని బొచ్చులో నాయకత్వం అన్నాడు కొందరికే తెలిసిన విషయాన్ని అందరికీ చెప్పాడు. అసలు సాయిరెడ్డి  పెట్టిన ప్రెస్ మీట్ జగన్ ని మరోసారి ఇబ్బందికి గురిచేసేలా ఉంది. వాస్తవానికి సాయిరెడ్డి రఘురామరాజు గురించి వేరే ఏ విషయాలైన చెప్పి ఉండాల్సింది. 

ఇదిలా ఉండగా... రఘురామకృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ సుమారు 100 పేజీల ఫిర్యాదును స్పీకరుకు అందించారు. ఇందులో రఘురామరాజు ఏం మాట్లాడిందీ, ఎలా మాట్లాడిందీ... వారు సాక్ష్యాలతో సహా వివరించారు. టీవీల్లో ఇచ్చిన ఇంటర్వ్యూల వీడియోలు, పేపర్ క్లిపింగ్స్ కూడా ఆ 100 పేజీల ఫిర్యాదులో  పొందుపర్చారు. స్పీకరును కలిసిన వారిలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిధున్ రెడ్డి, ఎంపీలు మార్గాని భరత్, బాలశౌరి, నందిగం సురేష్, లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు.