వైసీపీ కాపు ఎమ్మెల్యేలూ.. మీకు టైమొచ్చింది

February 19, 2020

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీలో కాపుల పరిస్థితి ఏంటంటే ప్రాధాన్యం లేదన్న సమాధానమే వస్తుంది. కాపుల రిజర్వేషన్ల గురించి జగన్ ఎన్నికల ముందే చేతులెత్తేశారు. అంతేకాదు... వంగవీటి రాధా వంటి కాపు నేతలకూ పొగపెట్టేశారు. టీడీపీ నుంచి తోట నరసింహం కుటుంబం చేరినా వారిని అంత హవాలోనూ గెలిపించుకోలేకపోయారు. ఉత్తరాంధ్రకు చెందిన కాపు నేత బొత్స సత్యనారాయణకు మంత్రి పదవి ఇచ్చినా ప్రాధాన్యం మాత్రం సున్నా అంటున్నారు. ఇలా కాపులు గతి లేక ఉంటున్నామన్నట్లుగా పదవుల కోసం వైసీపీని పట్టుకుని వేలాడుతున్నారన్న విమర్శలు చాలాకాలంగా ఉన్నాయి. అయితే.. కొద్దిరోజుల పాటు వైసీపీలో కాపులకు ప్రయారిటీ దొరకనుందట... ప్రయారిటీ అంటే పదవులో, ఇంకేదైనా లాభమో కాదు.. మైకు చేతికిస్తారట.
వైసీపీలో ‘కాపు నేతలకు మైకు’ పథకం శనివారం నుంచే మొదలైపోయింది. అంతకుముందెన్నడూ సొంత నియోజకవర్గం తప్ప ఇంకెక్కడా ప్రజలకు తెలియని కాపు నేతలకు ఒక్కసారిగా ప్రాధాన్యం పెంచారు శనివారం నుంచి. అందుకు కారణం.. జనసేన అధినేత పవన్. ఆయన జగన్ 100 రోజుల పాలనపై నివేదిక ఇచ్చి విమర్శలు గుప్పించడంతో పవన్‌పై విమర్శలు కురిపించేందుకు ఆయన సామాజికవర్గానికే చెందిన కాపు నేతలను ఎంచుకుంటున్నారు. అంతకుముందు వైసీపీలో నోరున్నఒకరిద్దరు కాపు నేతలు తప్ప మిగతావారు ఎక్కడా కనిపించేవారు కాదు. కానీ... శనివారం నుంచి కాపు నేతల జోరు పెరిగింది. వారంతా పవన్‌పై విరుచుకుపడుతున్నారు.
గుంటూరు జిల్లా పొన్నూరు వైసీపీ ఎమ్మెల్యే కిలారు రోశ‌య్య, మరికొందరు కాపు నేతలు శనివారం పవన్ పై విమర్శలు చేయడం.. వారిని వైసీపీకి చెందిన చానళ్లలో గంటలు గంటలు చూపించడం ఆ పార్టీ వ్యూహాన్ని ప్రతిబింబిస్తోంది. విశాఖలోని వైసీపీ కాపు నేతలు కూడా శనివారం ఒక్కసారిగా యాక్టివేట్ అయ్యారు. దీంతో కొద్దిరోజుల పాటు పవన్‌ను ఎదుర్కొనేందుకు వీరందరికీ ప్రాధాన్యం పెంచుతారని రాజకీయ పండితులు అంచనాలు వేస్తున్నారు.