జగన్ సర్కారు అంత వీకా? - సుజనా చౌదరి

August 03, 2020

పార్క్ హయత్ హోటల్లో సుజనాను కామినేని శ్రీనివాస్, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలవడంపై వైసీపీ రాద్ధాంతం చేసిన విషయం తెలిసిందే. అయితే టీ కప్పులో తుఫానులా మారి వైసీపీకి పిచ్చెక్కించింది. ఆ పార్టీ అనుకున్నది ఏం జరగలేదు. దీంతో వారు నిరాశకు గురయ్యారు. దీనిపై ఒక మీడియా సుజనా చౌదరిని సంప్రదించగా... ఏపీ ప్రభుత్వం డొల్లతనాన్ని ఆయన ఎండగట్టారు.

దేశంలో ఏ పరిణామం జరిగినా దాని గురించి అభద్రతతో ఫీలయ్యేంత దుస్థితిలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అదేనండీ వైసీపీ ఉందా అని సుజనా చౌదరి ప్రశ్నించారు. ప్రతి వ్యక్తికి పర్సనల్ లైఫ్ ఉంటుంది. కొందరు వ్యక్తులు పబ్లిగ్గా కలిస్తే అంత భయం ఎందుకు? వారు కుట్ర అంటున్నారు.. దేనికి కుట్ర వారి సర్కారును కూలుస్తామనా? అంత భయం ఎందుకు? వారి ప్రభుత్వం అంత పనికిమాలిన పనులు చేస్తోందా? పార్టీ అంత వీక్ గా ఉందా? ప్రజల మద్దతే లేదా... మరి కుట్ర కుట్ర అని మాటిమాటికీ భయపడతారు ఎందుకు అంటూ సుజనా చౌదరి కడిగి పారేశారు. 

పాలనపై దృష్టిపెట్టకుండా రెండు నెలలుగా ఏపీలో ప్రభుత్వ అసమర్థత బయటపడుతోంది. హైకోర్టు, సుప్రీంకోర్టు అన్నీ ప్రభుత్వం చేస్తున్న పనులను తప్పుపడుతున్నాయి. ప్రజలకు కూడా వీళ్ల సంగతి అర్థమవుతోంది. వారు స్వయంగా గమనిస్తున్నారు కదా ఏపీలో ఏం జరుగుతోందో అన్నారు. 

ఏపీలో ప్రతి వ్యవస్థను నాశనం చేసేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజార్చారు. ప్రజలంతా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. వాళ్లతో అనుకూలంగా ఉంటే ఓకే. లేకపోతే కేసులు పెడతారా? ప్రజాస్వామ్య దేశంలోని ఒక భాగమైన ఏపీలో అమరావతి ప్రజల హక్కులు కాలరాయడం నిజం కదా? అభద్రత, అరాచకం తప్ప ఏపీలో ఏం లేదు? అని సుజనా అన్నారు.

ఆయన అభిప్రాయాన్ని మీరే వినండి.