ఏపీలో దారుణాలను ఎవరూ పట్టించుకోరా?

May 25, 2020

​ఒక్కోసారి కొన్ని సంఘటనలు చూస్తుంటే విచిత్రం అనిపిస్తుంది. మనుషులు ఎవరైనా ఒకటే... అందరికీ కోపతాపాలుంటాయి. అన్ని ఊళ్లలో రాజకీయాలు మామూలే. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక... గ్రామాల్లో పరిస్థితులు పాత సినిమాల కంటే దారుణంగా ఉన్నాయి. అధికార పార్టీ అయినంత మాత్రాన ప్రతిపక్ష పార్టీ వాళ్లను కొడుతుంటే, ఆస్తులు ధ్వంసం చేస్తుంటే... పంటలు నాశనం చేస్తుంటే పోలీసులు చూస్తూ ఊరుకుండటం ఏంటి? బాధితులు ఊరు వదిలి పోవడం ఏంటి? గతంలో వైఎస్ హయాంలోనూ ఇలాగే జరిగింది. అప్పట్లో వైఎస్ అధికారంలోకి వచ్చాక కొన్ని నెలలపాటు తొలిరోజుల్లో ఇలా జరిగింది. కాకపోతే ఇంత అరాచకం అయితే లేదు. వారు తమ ప్రత్యర్థులు అయిన కొందరు పెద్ద వాళ్లను టార్గెట్ చేశారు. సామాన్యుల జోలికి పోలేదు. ఊర్లకు ఊర్లను తరిమేయలేదు. కానీ జగన్ పార్టీ నేతలు పేదలు, సామాన్యులను వేధిస్తున్నట్లు, తరిమేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎటువంటి శత్రుత్వం లేకపోయినా... తెలుగుదేశం వారంతా శత్రువులుగా చూస్తున్న దారుణమైన పరిస్థితి.

పేపర్లలో పెద్ద పెద్ద అక్షరాలతో బ్యానర్ ఈ వార్తలు పబ్లిష్ అవుతున్నాయి. సాక్ష్యాలు గట్టిగా ఉన్నాయి. జగన్ పార్టీ నేతలు చేస్తున్న అరాచకాలు ఈ స్థాయిలో ఉన్నా హక్కుల కమిషన్లు, హైకోర్టులు సుప్రీంకోర్టులు ఏమయ్యాయి? ఎందుకు వీటిపై సుమోటాగా కేసులు ఫైల్ చేయడం లేదు. ఎవరికి ఎవరు భయపడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే... బాధితులకు ఆశ్రయం ఇస్తాను అని చంద్రబాబు చెబుతున్నారు. దాడులు మొదలై రెండు నెలలు పైన అయ్యింది. ఎందుకు రాష్ట్ర వ్యాప్తందా వీటిపై కేసులు పెట్టి కోర్టుల మెట్టు ఎక్కట్లేదు. టీఆర్ఎస్ నేతలు కేసీఆర్ ను, పార్టీ నేతలను ఒక్క మాట అంటే చాలు వేగంగా రెస్పాండ్ అవుతారు. కానీ తెలుగుదేశం పార్టీలో ఇంత అలసత్వం ఏంటి? ఎందుకు లీగల్ పోరాటంలో ఇంత ఆలస్యం చూపుతుంది తెలుగుదేశం పార్టీ?

ఇక మొన్నటి వరకు స్థానిక ఎమ్మెల్యేలు, మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసినవారు ఏమయ్యారు.  తమ నియోజకవర్గ ప్రజలను వేధిస్తుంటే... ఎందుకు అడ్డుకోవడం లేదు? ఎందుకు ప్రశ్నించడం లేదు? ఎందుకు నిరసనలు ధర్నాలు చేయడం లేదు. సామాన్య  కార్యకర్తలకు భరోసా ఇవ్వలేని నేతలు పార్టీకి ఏం ఉపయోగపడతారు? సోషల్ మీడియాలో బెదిరింపులతో వైసీపీ వెనక్కు తగ్గుతుందా? న్యాయస్థానాల సాయంతో అరాచకాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉన్నా ఎందుకు ఆ దిశగా వేగంగా కదలడం లేదు అన్నది అంతుపట్టని ప్రశ్న. గతంలో కూడా ఇంతే. వైసీపీ నేతలు, కార్యకర్తలు... చంద్రబాబును లోకేష్ ను పచ్చి బూతులు తిట్టేవారు. అయినా వారిపై కేసుల పెట్టడానికి టీడీపీ చాలా భయపడేది. రహస్యంగా ఓ 15 కేసులు పెట్టింది అంతే. కానీ వైసీపీ ఈ మూడు నెలల్లోనే వెయ్యి కేసులు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులపై నమోదు చేసింది. సోషల్ మీడియాలో జగన్ ని ఏమైనా అనాలంటే తెలుగుదేశం వారు భయపడుతున్నారు. కానీ గతంలో వైసీపీ వాళ్లు ధైర్యంగా తిట్టేవారు. 

టీడీపీ నాయకత్వంలో గాని, టీడీపీ కార్యకర్తల్లో గాని ఈ భయం రావడానికి కారణం... జగన్ ది పులివెందుల అనా? జగన్ ది ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ అని భయపడుతున్నారా? ఏది ఏమయినా... ఇంత అలసత్వంగా టీడీపీ స్పందిస్తే పార్టీ కొత్తవారిని ఆకట్టుకోకపోగా... ఉన్న వారిని పోగొట్టుకుంటుంది. అయినా... ఎపుడూ కూడా అధికారంలో ఉన్న పార్టీ భయపెట్టే స్వేచ్ఛ ప్రతిపక్షానికి ఉంటుంది. కానీ అందులో టీడీపీ పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది.