ఏపీలో జగన్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎన్ని స్ట్రిక్ట్ వార్నింగ్లు ఇస్తున్నా వారు ఇప్పటి వరకు ఓపిక పట్టుకుని కూచొని ఉన్నా ఇక ఆగలేకపోతున్నారు. ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేశాం... ఇప్పుడు మేం సంపాదించుకోకపోతే ఇక పదవిలో ఉండి ఎందుకు ? అన్నట్టుగా చేయి చాచేస్తున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు అస్సలు అవినీతి మరక అంటేందుకు జగన్ ఇష్టపడకపోయినా ఇప్పుడిప్పుడే మంత్రులు, ఎమ్మెల్యేలు తమ చేతివాటం చూపిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే జగన్కు బాగా కావాల్సిన ఓ మంత్రి ఏకంగా గుంటూరు జిల్లాలో సొంత పార్టీ ఎమ్మెల్యేలకు హుకుం జారీ చేయడం ఇప్పుడు గుంటూరు జిల్లా రాజకీయాలను వేడెక్కించింది.
గుంటూరు జిల్లాలో కృష్ణానదిని అనుకున్న ఉన్న రెండు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాథినిత్యం వహిస్తున్నారు. వీరిలో ఒకరు తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే... మరొకరు మాత్రం తొలిసారి ఓడి.. రెండో ప్రయత్నంలో ఎమ్మెల్యేలు అయ్యారు. వీరిద్దరు ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. అసలు ఈ రెండు నియోజకవర్గాలు ఇసుక రీచ్లకు పెట్టింది పేరు. టీడీపీ టైంలో అయితే ఇక్కడ ఇసుకే బంగారం అయ్యింది. దీంతో వీరు కూడా ఇసుకతో కాసులు పిండుకోవచ్చని బాగానే ఖర్చు పెట్టారు. దీంతో ఇప్పుడు ఓ మంత్రి ఫోన్ కాలతో వీరి ఆశలు అడియాసలు అయ్యాయి. ఆ మంత్రి నేరుగా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి.. అక్కడ ఇసుక రీచ్లు మీరు వదిలేయండి... మా వాళ్లు చూసుకుంటారని చెప్పడంతో వాళ్లిద్దరు షాక్ అయ్యారు.
ప్రస్తుతం ఇసుక అంతా ప్రభుత్వ పాలసీ మేరకు మాత్రమే ఇవ్వాల్సి ఉంది. ఓ వైపు వీళ్లు కూడా కాచుకుని కూర్చొని ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ మంత్రి ఫోన్ చేసి హుకుం జారీ చేయడంతో వీళ్లు షాక్ అవుతున్నారు. దీంతో రాజధాని జిల్లాలో వైసీపీ రాజకీయం రసకందాయంగా మారింది. సదరు మంత్రి సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడు. గత ఎన్నికల్లో ఓ జిల్లా వైసీపీ అభ్యర్థుల ఖర్చంతా ఆయనే పెట్టుకున్నట్టు వినికిడి. దీంతో సదరు ఇద్దరు ఎమ్మెల్యేలు తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో ? తెలియక సతమతమవుతున్నారు.
ఈ పరిణామం జిల్లాలో చర్చకు దారితీసింది. తమ నియోజకవర్గంలో సదరు సీమ మంత్రి పెత్తనం ఏంటని వారు ఫైర్ అవుతున్నా.. జగన్ సామాజికవర్గానికే చెందిన వాడు కావడంతో పాటు ఆయన కుటుంబం మొత్తం జగన్కు సన్నిహితం కావడంతో ఏం చేయలేని పరిస్థితి. ఇక ఈ విషయం తెలిసిన మిగిలిన ఎమ్మెల్యేలు సైతం తమ జిల్లాపై సీమ మంత్రి పెత్తనం ఏంటి ? తమకు ఆయన ఆదేశాలు ఏంటని ? అసహనం వ్యక్తం చేస్తున్నారు.