​కరోనాకు ఏపీలో ఊరేగింపులు !

August 06, 2020

ప్రపంచం మొత్తం ఒకటే వేదం వల్లిస్తోంది... *సోషల్ డిస్టెన్స్* అని ! కరోనా మహమ్మారి ఒక్కసారి జనంలోకి వెళ్తే దానిని అదుపు చేసేటంత ఆస్పత్రి సదుపాయాలు అమెరికా దగ్గర కూడా లేవు. మన దగ్గర అయితే శవాలు లెక్కపెట్టుకోవాల్సిందే. అంత దారుణమై పానిక్ సృష్టించగలిగిన ఘోరమైన వ్యాధి అది. మరణాలు శాతంలో చూస్తే తక్కువే కావొచ్చు. కానీ 6 కోట్ల ఆంధ్ర జనాభాలో ఒక్క శాతం అంటే 6 లక్షల మరణాలు. మరి ఎక్కడో అమెరికాలో 50 వేల మంది మరణిస్తే వణికిపోతున్న మనం ఏపీలో 6 లక్షల సంఖ్య ఊహించుకోగలమా?  

అవగాహన రాహిత్యం, బాధ్యతా రాహిత్యంతో జనాల ప్రాణాలను పణంగా పెట్టి, లాక్ డౌన్ ను తుంగలో తొక్కి జనాలను వందలాది గా పోగేసి ఏపీ భవిష్యత్తుతో ఆడుకుంటున్న వైసీపీ నేతలపై ఏపీ జనం రగిలిపోతున్నారు. వైసీపీ నేతలకు కరోనా అంటే ఆషామాషీ అయిపొయింది. పది రోజుల క్రితం చిత్తూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న 11 మంది ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది. జిల్లాలో ఒక్కరోజే 25 కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. తాజాగా సూళ్లూరు పేటలో మరో వైసీపీ నేత భార్యా ర్యాలీగా వందలాది ట్రాక్టర్లను ఏర్పాటుచేసి దానాలు ధర్మాలు చేస్తున్నారు. 

వీరిచ్చే వెయ్యి రూపాయల సరుకుల సాయానికి పోయిన జనానికి కరోనా అంటిస్తున్నారు వైసీపీ నేతలు. దేశమంతటా జాతీయ మీడియా ఛానెళ్లలో దుమ్మెత్తిపోస్తున్నా వీరి తీరు మారడం లేదు.రోజా పుత్తూరులో చేసిన పని, రాత్రి ప్రకాశం జిల్లా కొండెపిలో భారీ సభ పెట్టి మరో వైసీపీ నేత చేసిన కరోనా వ్యాప్తికి దోహదం చేసేవే. ఇక విజయసాయిరెడ్డి అయితే... మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా జనాల్ని గుమిగూడేలా చేసే పబ్లిసిటీ పిచ్చితో ఏం చేస్తున్నాడో తనకే తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. తన స్వచ్ఛంద సంస్థ ప్రగతి భారత్ ఫౌండేషన్ ప్రచారం కోసం అమాయకులను బలిచేస్తున్నారు. 

సామాన్యులు కూరగాయల కోసం, మందుల కోసం బయటకు వచ్చినా కొట్టి చంపేస్తున్న పోలీసులు అధికార పార్టీ ప్రతినిధులు ఇలా మందిని పోగేసి సాయం పేరుతో రాజకీయ ప్రచార ర్యాలీలు చేస్తూ కరినాని ప్రజలకు పంచుకుంటూ, పెంచుకుంటూ పోతుంటే, వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోరు. ఏపీ పోలీసులకు పైనుంచి విపరీతమైన ఒత్తిళ్లు ఉండటంతో ఏం చేయలేని పరిస్థితి ఉందంటున్నారు. ఇలాంటి నాయకులు ఉన్నంత కాలం ఏపీలో కరోనా పెరుగుతుందే కానీ తగ్గదు. దానికి నిదర్శనం ఈరోజు 80 కేసులు నమోదు కావడమే. గుంటూరు జిల్లాలో, కర్నూలు జిల్లాలో విపరీతంగా కరోనా విజృంభిస్తోంది.​