జగన్ టీంలో మొదటి అసంతృప్తి బయటకువచ్చింది

May 24, 2020

అప్రహతిహతమైన మెజారిటీ వచ్చాక జగన్ వైపు వేలెత్తి చూపడానికి  ఆ పార్టీలో ఎవరూ ధైర్యం చేయలేదు. చరిత్రలో ఎన్నడూ లేనట్టు 80 శాతం సీట్లు సాధించిన జగన్... బలమైన నాయకుడిగా మారడం, ప్రాంతీయ పార్టీ కావడం, ఏపీలో టీడీపీ కాకుండా మరో ఆశాజనకమైన ప్రత్యామ్నాయం లేకపోవడంలో వైసీపీలో అసంతృప్తులు ఉన్నా బయటకు రావడం లేదు.

అయితే... ఇంతకాలానికి మొదటిసారి అసంతృప్తి బయటపడింది. వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న జగన్‌ తీరుపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై విమర్శలు చేశారు. జగన్ తిట్టిన వారికే పదవులు ఇస్తారా? అంటూ ప్రశ్నించారు. తన నియోజకవర్గం నేతలతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

బొత్స ఎవరు...? జగన్ ను, వైఎస్ కుటుంబాన్ని వ్యక్తిగత విమర్శలు చేసిన మనిషి. చివరకు విజయమ్మ కూడా విజయ అని సంబోధించిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి జగన్ మంత్రి పదవి ఇచ్చి అందలం ఎక్కించారు. అంతేనా... నెల్లూరు ఆనం సోదరులు జగన్ ను తిట్టని తిట్లే లేవు. ఏకంగా జగన్ ను ఉరితీయాలని వారు చేసిన వ్యాఖ్యలు మరిచిపోయారు. చివరకు వారికి కూడా పదవులు ఇచ్చారు. కానీ ఇంతకాలం జగన్ వెంట నడిచి జగన్ తోనే ఉన్న నాకు ఉత్తచేయి చూపించారు. పార్టీలో ఎప్పట్నుంచో ఉన్న మాకంటే... నిన్నా మొన్న వచ్చిన వాళ్లకే ప్రాధాన్యతనా? అని ప్రశ్నించారు నల్లపురెడ్డి. ఈయన విమర్శలు పార్టీలో కలకలం రేకెత్తించాయి. సడెన్ గా ఎందుకు నల్లపురెడ్డి ఈ సమయంలో ఇలా మాట్లాడారు అన్నది చర్చనీయాంశం అవుతోంది.