3 రాజధానులు వద్దు - వైసీపీ ఎమ్మెల్యే

April 07, 2020

ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చంటూ ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై విపక్షానికి చెందిన పలువురు నేతలు సైతం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ స్వాగతిస్తున్న వేళ.. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు వ్యతిరేకించటం ఆసక్తికరంగా మారింది. ఏపీకి మూడురాజధానులపై ముఖ్యమంత్రి వాదనను తాను వ్యతిరేకిస్తున్నట్లుగా చెప్పి వార్తల్లోకి వచ్చారు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.
అసెంబ్లీ.. పాలనా విభాగం ఒక్కచోటే ఉండాలన్నది తన అభిప్రాయంగా ఆయన చెప్పుకొచ్చారు. అసెంబ్లీ.. సెక్రటేరియట్ రెండు ఒకేచోట ఉండాలన్నది తన అభిమతమని.. అది తన ఆలోచన మాత్రమేనని చెప్పారు. ఇదే అభిప్రాయాన్ని తాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి  కూడా చెబుతానని చెప్పారు.
విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలన్న ఆయన.. ఇప్పటికే హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో వచ్చి నష్టపోయిన విషయాన్ని గుర్తు చేయటం గమనార్హం. మరోసారి ప్రజలు నష్టపోవటం భావ్యం కాదన్న ఆయన.. నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత అయినా ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకుంటారన్నారు.
సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకునే వరకూ ప్రజలు అపోహలకు గురి కావొద్దన్నారు. జగన్ నిర్ణయాన్ని విపక్షానికి చెందిన కొందరు నేతలు సైతం స్వాగతిస్తున్న వేళ.. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్య మాత్రమేనని.. నిర్ణయం కాదని.. తొందరపడటం సరికాదన్న మాట వినిపిస్తోంది. తాను చెప్పిన మూడు రాజధానులపై సొంత పార్టీ ఎమ్మెల్యే వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వేళ.. జగన్ తుది నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.