జగన్ పాలన దుమ్ముదులిపిన మరో వైసీపీ ఎమ్మెల్యే

August 05, 2020

విజయసాయిరెడ్డేమో జగన్ ఏడాదిలోనే అంతా సెట్ చేశాడు... జనరంజక పాలన అందిస్తున్నారు అని చెబుతున్నారు. ప్రతిపక్షాలు మాత్రం అంతా వినాశనం అంటున్నాయి. వీరిద్దరినీ పక్కనే పెడితే సొంత పార్టీలోనే జగన్ పాలనకు సొంత ఎమ్మెల్యేలు జీరో మార్కులు, థర్డ్ క్లాస్ మార్కులు వేస్తున్నారు. నెల్లూరులో కీలక నేత అయిన ఆనం రామనారాయణ జగన్ పాలనపై నియోజకవర్గ స్థాయిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఏ పనీ జరగడం లేదు, జగన్ లేఖను మాటను కూడా ఇక్కడ అధికారులు పట్టించుకోవడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు నియోజకర్గంలో జీరో అభివృద్ధి అని విమర్శించారు. 

ఒకవైపు సీఎం మోస్ట్ పాపులర్ సీఎం అని సర్వేలు వెల్లించారు నిన్నే. ఆ సర్వేకు ముందు, తర్వాత సొంత ఎమ్మెల్యేలే అబ్బే పాలన ఏం బాలేదబ్బా అంటున్నారు. ఇటీవలే తాగునీటి కోసం వైసీపీ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి ధర్నా చేశారు. ఇదేం కర్మ... మాకు మంచినీళ్లివ్వలేరా అని అధికారులను నిలదీశారు. తర్వాత కార్యకర్తలు అడిగిన బొచ్చెడు ఇసుక ఇవ్వలేకపోతున్నాం... ఇసుక్ రీచ్ లో బయల్దేరిన లోడు మా ఊరికి రాకుండానే మాయమైపోతుందని వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మీడియా సమక్షంలో జెడ్పీ సమావేశంలో వాపోయాడు. ప్రభుత్వమేమో ఇసుక పాలసీ అద్భుతం అంటోంది. కానీ బ్లాక్ లో కొంటేగాని ఊళ్లలో ఇసుక దొరకని పరిస్థితి. 

కొన్ని నెలల క్రితం స్పీకర్ తమ్మినేని సీతారాం... నాటు సారా మాఫియా నడుస్తోందని ఏకంగా మీడియాకే చెప్పారు. మరి సీఎం కుర్చీలో ఉన్న జగన్ అన్న, తనకు బాకా ఊదే కొందరు మంత్రులు మాత్రం అన్న గ్రేట్ అంటుంటే... పాలనను విమర్శించే వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.

తాజాగా ఆనం రామనారాయణ రెడ్డి జగన పాలనపై తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఈ ఏడాది కాలంలో తన నియోజకవర్గం వెంకటగిరికి ఏమీ చేయలేకపోయానని ఆనం ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. జలవనరుల శాఖ అధికారులే నీళ్లను అమ్ముకుంటున్నారు. తాను ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేశాను. ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని ఆనం రామనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పదవిలో కూర్చోవడానికి కాదు తాను ఎన్నికైంది... నా ప్రజల సమస్యలు తీర్చడానికి... కానీ జిల్లా అధికారుల తీరు దారుణంగా ఉందని ఆనం అసహనం వ్యక్తం చేశారు.  

వెంకటగిరి నియోజకవర్గాన్ని అధికారులు మర్చిపోయారు. నియోజకవర్గ ప్రజలకు నేరుగా అందే సంక్షేమ కార్యక్రమాలు తప్ప...మిగతా ఏ కార్యక్రమాలనూ తాను చేయలేకపోతున్నాను  సీఎం జగన్ చేత చెప్పించినా లెక్క చేయడం లేదు. నా ప్రాంత ప్రజల కోసం తాను ఏమీ చేయలేకపోతున్నాను. మరీ ఇంత అధ్వాన్నమా... నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రులకు ఇచ్చిన డీపీఆర్ లు ఎక్కడున్నాయో కూడా తెలియని పాలన సాగుతోంది. ఇంకో ఏడాది చూస్తాను... మారకపోతే ప్రజలతో కలిసి నేనే ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సి వస్తోందన్నారు.

ఇదిలా ఉండగా... ఈ ఏడాదిలో సంక్షేమ పథకాల ప్రకటన మినహా, డబ్బు పంపిణీ మినహా మిగతా కార్యక్రమాలు శూన్యం.  పైగా తటస్థ వర్గాలలో జగన్ పై తీవ్ర అసంతృప్తి పెరిగింది. తటస్థులు ఎపుడైనా రాష్ట్రం కోసం ఓటేస్తుంటారు. కానీ జగన్ తన కార్యకర్తలను మేపడానికి సంక్షేమ పథకాలకు ఖర్చుపెట్టడానికి తప్ప... ప్రాజెక్టులు, రోడ్లు, కాలువలు, గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన వంటి వాటిని మరిచిపోతున్నారు. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఎమ్మెల్యేలు బయటపడుతున్నారు. ఇంకా ఎంతమందిలో అసంతృప్తి ఉందో...  జగన్ కు అన్ని వైపుల నుంచి దాడి మొదలైనట్లే కనిపిస్తోంది.