జగన్ రాజ్యంలో అరాచకంపై వైసీపీ మరో ఎంపీ మాటల్లో వినండి

August 14, 2020

అధికారం పీఠం ఎక్కితే ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎంజాయ్ చేసినంత ఈజీగా ఉండదు. నిత్యం సమస్యలు... నలుదిక్కుల నుంచి వాటిని సరిదిద్దగలిగిన నైపుణ్యం, పరిపాలన దక్షత ఉండాలి. ఒకటీ రెండూ ప్రతి విషయంలో జగన్ అనుభవ రాహిత్యం, తప్పటడుగులు కనిపిస్తున్నాయి. ఇసుక ప్రభుత్వ అసమర్థతకు పరాకాష్ట అయితే... చివరకు కోవిడ్ సెంటర్లలో సరైన భోజనం పెట్టేలా చూడలేని వైఫల్యం అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది.

ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ క్వారంటైన్ సెంటర్లపై కంప్లయింట్లు వస్తున్నాయి. ఒక వ్యక్తి అయితే... ఇక్కడ మమ్మల్ని పెట్టడం కంటే చంపేస్తే సంతోషంగా ఉంటాం అని వాపోయాడంటే క్వారంటైన్ సెంటర్లు ఎంత ఘోరంగా ఉన్నాయో అర్థమవుతోంది. సరే అది నింద మాత్రమే అని వైసీపీ వాళ్లు కొట్టిపారేయొచ్చు. కానీ ఇపుడు వైసీపీ రాజమహేంద్రవరం ఎంపీ, జగన్ భక్తుడు మార్గాని భరత్ రామే... కోవిడ్ సెంటర్లలో భోజనం నీచంగా ఉందని అన్నారు. మరి ఇపుడు అయినా నమ్ముతారా?

రోజుకు ఒక బాధితుడికి టిఫిన్‌, భోజనం, స్నాక్స్‌, డిన్నర్‌ అందించడానికి రూ.200 ఇస్తున్నప్పటికీ, నాణ్యమైన భోజనం అందడం లేదని మార్గాని భరత్‌రామ్‌ ఆవేదన చెందారు. అనంతరం  మంచి భోజనం ఎందుకు పెట్టడంలేదని కాంట్రాక్టర్లను నిలదీశారు. లోపాలను సరిచేసుకోని పక్షంలో కాంట్రాక్టు ఏజెన్సీని రద్దు చేయిస్తానని హెచ్చరించారు. 

ప్రపంచ వ్యాప్తంగా సేవకు, నాణ్యతకు మారుపేరైన అక్షయపాత్రను పేరు పెట్టిన ఘనులు వైసీపీ నేతలు. రోజుకు కనీసం కోటి మందికి అతి తక్కువ ఖర్చుతో సంతృప్తికరమైన పోషకాహారం పెడుతున్న అక్షయ పాత్ర వంటి సంస్థను సంస్థలను వదిలేసి అనామకులైన లోకల్ పార్టీ నేతలకు కోవిడ్ క్వారంటైన్ల భోజన ఏర్పాట్లు చూడమని డబ్బులు పోస్తే ఎలా మంచి ఫలితాలు వస్తాయి. వారి నైపుణ్యం, సమర్థత ఏమిటి ? ఎంచుకునేటపుడు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఇపుడు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ఆగ్రహం నటిస్తే ప్రజలు సంతృప్తి చెందుతారా? మొత్తానికి వైసీపీ నేతల నోటి నుంచే జగన్ పాలనలో లొసుగులు బయటకు రావడం విచిత్రమే.