వైసీపీ మెడలో రఘురాముడి గంట !

August 10, 2020

తిరుగులేని రీతిలో అధికారాన్ని చెలాయిస్తూ.. విరుచుకుపడే విపక్షానికి చుక్కలు చూపిస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అండ్ కోపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీకి చెందిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు. నరసాపురం లోక్ సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన నోటి నుంచి వచ్చిన షాకింగ్ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆయనపై వేటు వేయాలన్న చర్చ కూడా ఇపుడు నడుస్తోంది. 

పార్టీకి చెందిన నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు తన మీద చేసిన విమర్శలు.. ఆరోపణలపై స్పందించారు. తాజాగా విడుదల చేసిన వీడియో సందేశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎలాంటి వ్యాఖ్యానం లేకుండా రఘురామ నోటి నుంచి వచ్చిన మాటల్ని యథాతధంగా చూస్తే..

* జగన్ వల్లే రఘురామ కృష్ణంరాజు ఇరవై రోజుల్లో ఎంపీ అయ్యారని నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి బతిమాలి వచ్చానా? లేక  వారు బతిమిలాడి నన్ను పార్టీలోకి చేర్చుకున్నారా? అన్న విషయం ప్రసాదరాజుకు బాగా తెలుసు.

* చెక్కులు తీసుకు వెళ్లిన వారికి సీఎం సమయం ఇచ్చారు. రఘురామ కృష్ణంరాజుకు ఎందుకు ఇవ్వరంటూ కాబోయే మంత్రి ప్రసాదరాజు ప్రశ్నిస్తున్నారు. ఎవరి నుంచీ డబ్బులు వసూలు చేసే అలవాటు నాకు లేదు.

* ప్రసాదరాజుతో ఎవరు మాట్లాడించారో నాకు తెలుసు. గత కొద్ది రోజులుగా నేను మీడియాలో ఇస్తున్న ఇంటర్వ్యూలను.. కొన్ని సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తూనే ఉన్నా.

* తిరుమల వెంకన్న భూముల విక్రయం.. ఇసుక బ్లాక్ మార్కెటింగ్.. ఐదు యూనిట్ల ఇసుక లారీకి రూ.40వేలు వసూలు చేస్తున్నారు. మంచి ఉద్దేశంతో.. ప్రజల్లో జీవితాంతం నిలిచిపోవాలన్న సదుద్దేశంతో సీఎం జగనన్న ఇళ్ల పథకం పెడితే.. ఫ్లాటుకు ఇంతని చెప్పి.. వసూళ్లు చేస్తున్నారు.

* అక్రమాలను సీఎం జగన్ వరకు వెళ్లాలన్న ఉద్దేశంతోనే మీడియాతో మాట్లాడాను. దీనికిచాలామంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభిమానులు నొచ్చుకున్నారు. ఎందుకు మీడియా ద్వారా మాట్లాడారు. నేరుగా సీఎంకే చెప్పొచ్చు కదా? అని అడుగుతున్నారు. సీఎంను సమయం అడిగినా ఇవ్వలేదు. అందుకే చెప్పా.

* జగన్ బొమ్మ పెట్టుకొని ఎన్నికలకు 20 రోజుల ముందు నెగ్గానని అంటున్నారు. ఆయన బొమ్మ చూపించి గెలిచే పరిస్థితి లేదు. అంతేకాదు.. ఆయన దయ వల్ల నాకు పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ పదవి దక్కలేదు.

* పార్టీకి ఉన్న సంఖ్య ఆధారంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక పదవే వస్తుంది. అది నాకివ్వాలని కోరితే రాజ్యసభ సభ్యుడు విజయసాయికి ఇచ్చారు. తమ పార్టీ కోటా అయిపోయినప్పటికీ ప్రధాని మోడీ.. లోక్ సభ స్పీకర్ వేరే కోటా నుంచి నాకు ఛైర్మన్ పదవి ఇచ్చారు.

* నేను వైసీపీ నుంచి నెగ్గినమాట నిజమే. కానీ నేను ఆ పార్టీలోకి వస్తానని గానీ.. సీటివ్వాలనిగానీ కోరలేదు. ఇంకా చెప్పాలంటే.. కాళ్లా వేళ్లా నన్ను బతిమాలారు.

* మీరు రావాలి .. వస్తేనే ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయని చెప్పి పార్టీలోకి తీసుకున్నారు. నరసాపురం టీడీపీ కంచుకోట అని వైసీపీ నేతలే చెప్పారు. ఆ టైమ్‌లో కొంత టీడీపీ అభ్యర్థుల ప్రకటన ఆలస్యం కావడం.. వీళ్ల ఒత్తిడికి లొంగడం.. కారణం ఏమైనా మంచిదో, చెడ్డదో మొత్తానికి ఏదొక నిర్ణయం తీసుకొన్నాను.

* అంతకుముందు ఒకసారి అడిగితే నేను ఛీ కొట్టాను. అది ఎవరి ఖర్మ అనేది పక్కన బెడితే.. నేను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాను. నేను కాబట్టే నెగ్గాను. ఈ విషయం అండర్‌లైన్‌ చేసి చెబుతున్నా.

* పాలకొల్లులో రామానాయుడు 19,000 మెజారిటీతో నెగ్గారు. ఉండిలో ఒక కొత్త వ్యక్తి, సుమారు 12,000నుంచి 13,000 మెజారిటీతో గెలిచారు.తణుకులో ఎమ్మెల్యేకి 2,500 మెజారిటీ వచ్చింది. నరసాపురంలో ప్రసాదరాజు 5000 మెజారిటీతో నెగ్గారు. నన్ను చూసి ఓట్లేస్తేనే వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలు నెగ్గారు. ఇది సెల్ఫ్‌ కాన్ఫిడెన్సుతో చెబుతున్నాను.

కరోనా వేళ ప్రజల మధ్య తిరగొద్దని కోర్టులు ఆదేశించినందునే.. బయటకు రాలేకపోయాను.

కొసమెరుపు - చాలామంది వైసీపీ నేతల్లో అసంతృప్తి ఉన్నా చెప్పే ధైర్యం గానీ, అవకాశం గాని, పరిస్థితులు గాని లేవు. చెప్పాక వచ్చే పరిణామాల్నీ మిగతా వాళ్లు తట్టుకోలేరు. అందుకే సైలెంటుగా ఉంటారు.