వాపా, బలుపా..?

June 01, 2020

ఏ వర్గానికైనా బలం పెరిగితే సంతోషిస్తారు. కానీ, వైసీపీ నాయకులు మాత్రం బలగం పెరిగేకొద్దీ బెంబేలెత్తిపోతున్నారు. ఇది వాపా, బలుపా అన్నది తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే, టీడీపీని ఎంత గట్టిగా కొట్టగలిగితే అంత గట్టిగా దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తున్న వైసీపీ అందుకు తగ్గట్లుగా భారీగా ప్రయత్నాలు చేస్తోంది. పదవులు, పలుకుబడి, ఇతర సహాయాలు ఎరగా వేసి టీడీపీ నాయకులను తమ బుట్టలో పడేస్తోంది. వీటికి లొంగనివారిని భయపెట్టి మరీ పార్టీలో చేరేలా బలవంతపెడుతోంది. ఒక్క టీడీపీ నుంచే కాకుండా... కమలం, జనసేన పార్టీలకూ పొగ పెడుతోంది.

ఈ నెలలో జరుగుతున్న స్థానిక ఎన్నికలు ఒక రకంగా జగన్ పాలనకు రెఫరెండం లాంటివే. అందుకే, వీలైనన్ని ఏకగ్రీవాలు, అలా కాకుంటే "ఎలాగైనా" గెలుపు బావుటా అన్న సూత్రంతో వైసీపీ పనిచేస్తోంది. స్థానిక ఎలక్షన్ల పోలింగ్ లోపు మరికొందరిని చేర్చుకుని బలం మరింత పెంచుకునేందుకు వైసీపీ అగ్రనాయకత్వం యమస్పీడుగా పావులు కదువుతోంది. వైసీపీ యాక్షన్‌కు రియాక్షనే...  మాజీ మంత్రి బాలరాజు, కదిరి బాబూరావు, రామసుబ్బారెడ్డి వంటి నేతల చేరికలు. నిన్నటికి నిన్న చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేశ్, మాజీ మంత్రి పాలేటి రామారావు సైతం వైసీపీ కండువా కప్పుకున్నారు. వీరి చేరికల వల్ల ఆయా జిల్లాల్లోని మరిన్ని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పాగా వేయొచ్చన్నది వైసీపీ మాస్టర్ ప్లాన్.
వైసీపీ అగ్రనేతల ఆలోచనలు ఇలా ఉంటే, కిందిస్థాయి నాయకులు మాత్రం తలలు పట్టుకుంటున్నారు. పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లు ఉంది పరిస్థితి అంటున్నారు. వైసీపీలో ఇప్పటికే అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో వర్గపోరు మరీ ముదిరింది. అగ్రనేతల పర్యటనల సందర్భంగా కుర్చీలతో కొట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా చేరేవారితో పార్టీలో పరిణామాలు ఎలా మారతాయోనని భయపడుతున్నారు. కొత్త చేరికల వల్ల తాత్కాలికంగా పార్టీ లాభపడినా, లాంగ్‌రన్‌లో మాత్రం నవ్వులపాలు కాకతప్పదని కిందిస్థాయి నేతలు గుసగుసలాడుతున్నారు. ఇదే విషయాన్ని పార్టీ సారథి జగన్‌కు గానీ, వలసల వెనుకున్న మాస్టర్‌ మైండ్ సజ్జల రామకృష్ణారెడ్డికి గానీ చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. అయితే, ఈ విషయం అధిష్టానానికి మాత్రం తెలీదా అని తమకు తామే సమాధానపడుతున్నారు. అంతగా ఇబ్బందులు వస్తే హైకమాండ్ చూసుకుంటుందిలే, ఇప్పటి నుంచి బుర్రలు బద్దలు కొట్టుకోవడమెందుకని సైలెంటుగా చూస్తూ ఉండిపోతున్నారు.