చంద్రబాబుపై వైసీపీ మాస్టర్ ప్లాన్ ఇదే !

June 05, 2020

సాధారణ పరిస్థితుల్లో రాజ్యాన్ని...లేదా రాష్ట్రాన్ని పరిపాలించడానికి పెద్దగా కష్టపడనవసరం లేదు. అయితే, ప్రకృతి ప్రకోపాలు, అనూహ్య విపత్తులు వచ్చినపుడు పాలన సాగించడానికి అపార అనుభవం...అకుంటిత దీక్ష...మనో నిబ్బరం.. వీటన్నింటికంటే ముఖ్యంగా అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని విపత్తు నిర్వహణ చేయడం వంటివి ఎంతో కీలకం. కరోనా మహమ్మారి ఏపీలో కోరలు చాస్తున్న సమయంలో అటువంటి అనుభవం దండిగా ఉన్న వ్యక్తి, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఉంటే పరిస్థితులు మరింత అదుపులో ఉండేవన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. హుద్ హుద్, తిత్లీ వంటి తుపానుల సమయంలో విపత్తు నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించిన అనుభవమున్న చంద్రబాబు... కరోనా క్రైసిస్ ను అవలీలగా ఎదుర్కొనేవారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సీఎం జగన్ అనుభవరాహిత్యం..అనాలోచిత నిర్ణయాల వల్ల ఏపీలో కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్నయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ టైంలో చంద్రబాబు సీఎంగా ఉండి ఉంటే పరిస్థితులు మెరుగ్గా ఉండేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, చంద్రబాబు సలహాతో విశాఖలోని మెడ్ టెక్ జోన్ లో మాస్కులు, వెంటిలేటర్ల తయారీని జగన్ మొదలుపెట్టడంతో...ఆ క్రెడిట్ చంద్రబాబుకు దక్కకుండా వైసీపీ నేతలు విష ప్రచారం మొదలుపెట్టారు. చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్నారని...కరోనా క్రైసిస్ లో ఏపీలో ఉండకుండా అక్కడేం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారు. 

వాస్తవానికి కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో చంద్రబాబు, లోకేశ్ మాత్రమే కాదు..జగన్ కూడా ప్రత్యక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లలేరన్న సంగతి విజయసాయి మరిచారు. జగన్, చంద్రబాబు, విజయసాయి...ఇలా ఎవరైనా సరే మీడియా ద్వారా లైవ్ లోనో...సోషల్ మీడియా, జూమ్ లైవ్ వంటి వాటి సాయంతోనో ప్రజలకు ఆన్ లైన్లో చేరువ కావడం తప్ప చేయగలిగిందేమీ లేదు. లైవ్ ద్వారా ప్రజలను చైతన్య పరచడం...వారిలో కరోనాపై అవగాహన కల్పించి...ధైర్యంగా ఉండాల్సిందిగా సందేశాలివ్వడం వంటివి అందరూ చేస్తున్నారు. చంద్రబాబు కూడా జూమ్ లైవ్ ద్వారా ప్రజలకు ధైర్యం నూరిపోసి...తన సందేశాన్నిచ్చారు. అయినా కూడా విజయసాయి...విమర్శలు మానుకోలేదు. దీనంతటికీ కారణం ఒక్కటే.

కరోనా టైంలో బాబు ఉంటే బాగుంటుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో, జగన్ కు క్రెడిట్ దక్కకుండా పోతుంది. అలా జరగకుండా ఉండాలంటే...చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేయాలి. అందుకే, విజయసాయితో పాటు పలువురు వైసీపీ నేతలు చంద్రబాబుపై దుష్ప్రచారం మొదలుపెట్టారు. చంద్రబాబు హయాంలో ఆ నిధులు వేస్ట్ చేశారని...ఫలానా కార్యక్రమాల కోసం డబ్బులు వేస్ట్ చేశారని ప్రచారం సాగిస్తున్నారు. ఆ సాకు చూపి ఉద్యోగులకు సగం జీతాలే ఇవ్వగలుగుతున్నామని తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కానీ, గురివింద నలుపు మాదిరిగా తమ తప్పులను వైసీపీ గుర్తించడం లేదు. 3 వేల కోట్లు ఖర్చు పెట్టి గ్రామ సచివాలయాలకు వైసీపీ నేతలు రంగులు వేయించడం... రంగులను తొలగించాలంటూ హైకోర్టు మొట్టికాయలు వేయడం తెలిసిందే. ఇక, పది కోట్ల రూపాయల విలువైన ప్రజావేదికను రాత్రికి రాత్రే కూల్చివేయడం...అన్నార్తులకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూసివేయడం...ఇలా పది నెలల పాలనలో చంద్రబాబుపై కక్ష్యతో పలు వ్యవస్థలను వైసీపీ నేతలు, సీఎం జగన్ నాశనం చేశారు. బాబు ఆధ్వర్యంలో ఏర్పాటైన మెడ్ టెక్ వంటి వాటిని వాడుకొని ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకుంటోన్న వైసీపీ నేతలు...తమ వైఫల్యాలను మాత్రం బాబు ఖాతాలో వేస్తున్నారు.

ఇక పక్క రాష్ట్రాల్లో ఏం చేసినా...జగన్ ను కాపీ కొట్టారంటూ మరో ప్రచారం చేస్తున్నారు. కేరళ సర్కార్ చేసిన సరుకులు, రేషన్ ఇంటింటి పంపిణీ వైసీపీని చూసి కాపీకొట్టారని వైసీపీ నేతలు అంటున్నారు. ఒరిస్సాలో పౌష్టికాహారం పంపిణీ చేసిన ఫొటోలను తమ రాష్ట్రంలో జరిగినట్లు బిల్డప్ ఇస్తున్నారు. మాచర్ల లో బొండా ఉమ, వెంకన్నలపై దాడి ఘటనను కప్పిబుచ్చుకునేందుకు ...మరీ దిగజారారు వైసీపీ నేతలు. మాచర్లలో ఓ కుర్రాడికి యాక్సిడెంట్ అయిన పాత ఫొటోను పెట్టి....ఉమ, వెంకన్న గుద్దారంటూ విష ప్రచారం చేశారు. కేవలం ఫేక్ ప్రాపగండాతో బాబుపై విషం చిమ్మడమే లక్ష్యంగా వైసీపీ నేతలు పనిచేస్తున్నారు. బాబును జనం మరచిపోవాలని...తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బాబుకు మంచిపేరు రాకుండా... జగన్ కు చెడ్డపేరు రాకుండా వైసీపీ చీప్ ట్రిక్స్ ఎన్నాళ్లు కొనసాగుతాయో చూద్దాం.