వైసీపీ వర్సెస్ బీజేపీ.. రాజకీయం మారిపోతోంది

July 05, 2020

టీడీపీ, జనసేనలు నిత్యం వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తుండడం.. ప్రతిగా వైసీపీ నుంచి కూడా ఆ రెండు పార్టీలపై విమర్శలు చేస్తుండడం కనిపిస్తోంది. అయితే, రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో మరో పోరాటం సాగుతోంది. అది వైసీపీ, బీజేపీ మధ్య. బీజేపీ చాపకింద నీరులా విస్తరిస్తుండడంతో ఆ పార్టీతో పాలక వైసీపీ ఘర్షణ పడుతోంది. ఇందుకు ఉదాహరణగా పలు ఘటనలు బయటపడుతున్నాయి.
* శ్రీకాకుళంలో బీజేపీ జెండా దిమ్మె క‌డుతుండడంతో పోలీసులు, వైసీపీ నాయకులు వెళ్లి అడ్డుకుని కూల్చేశారు.
* గుంటూరు జిల్లా ప‌ల్నాడులో బీజేపీ స‌భ్య‌త్వం సేక‌రిస్తుంటే దాడి చేశారు.
ఇప్ప‌టి వ‌ర‌కూ వైసీపీ శ్రేణులు టీడీపీ, జనసేనలను మాత్రమే ప్ర‌త్య‌ర్థిగా భావించాయి. ఇప్పుడు బీజేపీ కూడా ఆ లిస్టులో చేరింది. జ‌న‌సేన‌, టీడీపీ, బీజేపీ మూడు మ‌న‌కు ప్ర‌త్య‌ర్థులేనంటూ పార్టీ నుంచి సందేశం అందిందని వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. అందుకే గ్రామాల్లో, పట్టణాల్లో బీజేపీ సభ్యత్వ కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలను వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారు.
సాక్షాత్తు వైసీపీ అధినేత జగన్‌కే కేంద్రంలోని పెద్దలు మోదీ, అమిత్ షాల అపాయింటుమెంట్లు అంత ఈజీగా దొరకకపోవడం.. సీబీఐ కేసుల్లో కోర్టు హాజరు నుంచి మినహాయింపు కూడా జగన్ సాధించుకోలేకపోవడం వంటి ఘటనలు బీజేపీ ఏమీ జగన్‌ను పాంపర్ చేయడంలేదన్న స్పష్టమైన సంకేతాలను పంపించింది. దీంతో ఏపీ బీజేపీ నాయకులు వైసీపీపై విమర్శల దాడి చేస్తున్నారు. కానీ, ఇంతవరకు క్షేత్ర స్థాయిలో వైసీపీ నాయకులు, శ్రేణులు బీజేపీ పట్ల కాస్త మెతగ్గా ఉండేవారు. ఇప్పుడు వైసీపీ అధిష్ఠానం నుంచి సంకేతాలు అందడంతో బీజేపీపై దాడులు మొదలుపెడుతున్నారని టాక్. 

కొసమెరుపు : వైసీపీ బాస్ లు జగన్, సాయిరెడ్డి, షర్మిల బీజేపీని ఏమీ అనలేరు. అందుకే ఆ ఫ్ర్రస్ట్రేషన్ ఇలా గ్రామ వార్డు స్థాయిలో తీర్చుకోవడానికి ఇదొక డ్రామా అని సోషల్ మీడియాలో వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.