ఇక అక్కడ వైసీపీ ఎన్నటికీ గెలవదు !!

February 17, 2020

హిట్ హార్డ్... ఉక్కు పాదం.. చావు దెబ్బ... ఇలాంటి పదాలన్నీ ఇపుడు అమరావతి గురించే వాడాలి. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయంతో వందేళ్ల వెనక్కు వెళ్లిపోయింది అమరావతి ప్రాంతం. చరిత్రలో తనను గెలిచిపించిన ప్రాంతానికి ఎవరూ చేయని అన్యాయాన్ని జగన్ చేశారు. ఏకంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్ ను ఓడించి వైసీపీ ఎమ్మెల్యేను గెలిపించిన మంగళగిరికి జగన్ తీవ్రమైన అన్యాయం చేశాడు. ఎంత అన్యాయం చేశాడంటే... జగన్ బతికున్నంత వరకు వైసీపీ ఇక అక్కడ ఎన్నటికీ గెలవనంత అన్యాయం చేశాడు. 

అసలు జగన్ రాకతోనే కుదేలైపోయిన మంగళగిరి నియోజకవర్గ రియల్ వ్యాపారం... జగన్ తాజా నిర్ణయంతో పాతాళానికి పడిపోయింది. రియల్ వ్యాపారం సంగతి పక్కన పెడితే.. ఆ ప్రాంత రైతులు కేవలం ప్రభుత్వాన్ని నమ్మి చేసిన భూత్యాగాలు వృథా అవడమే కాకుండా వారిని దిక్కుతోచని స్థితికి నెట్టాయి. పాత పొలం తిరిగి రాదు కాబట్టి వ్యవసాయం చేయలేరు. వచ్చే ప్లాటుకు విలువ ఉండదు ఎందుకంటే అమరావతే లేదు. అటు ముందుకు వెనక్కు వెళ్లలేక మంగళగిరి ప్రజలు తీవ్రమైన వేదనలో ఒత్తిడిలో మగ్గుతున్నారు. ఇది ఆ ప్రాంతాన్ని ఎంత దెబ్బతీసిందో చెప్పడానికి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల అజ్జాత వాసమే నిదర్శనం. సమీప భవిష్యత్తులో ఆళ్ల రామకృష్ణారెడ్డి కనిపిస్తే కొట్టేలా ఉన్నారు అక్కడి ప్రజలు. 

ఇది పక్కన పెడితే... ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరిలో గెలవాలని లోకేష్ పెట్టుకున్న లక్ష్యాన్ని జగన్ నెరవేర్చాడు. వచ్చే ఏ ఎన్నికలో కూడా ఇక్కడ వైసీపీ గెలవదు. లోకేష్ కు ఇక తిరుగు ఉండదు. కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ఎవరు నిలబడినా గెలిచేది లోకేషే. రాజధాని అత్యధిక ప్రాంతం మంగళగిరి నియోజకవర్గంలో ఉండగా... కొంత ప్రాంతం తాటికొండ నియోజకవర్గంలో ఉంది. ఇక్కడ కూడా వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి గెలిచారు.  ఆమెకు కూడా భవిష్యత్తులో ఇబ్బందే. ఇంకా చెప్పాలంటే... గుంటూరు, కృష్ణాలో రాజధాని తరలింపు నిర్ణయం వైసీపీకి భారీగా దెబ్బ వేసేలా ఉంది.