`దిశ` హత్యోందతం తర్వాత అందరూ ఈ ఘటనపైనే చర్చించుకుంటున్నారు. పార్లమెంట్ లోని ఉభయ సభల్లో ఈరోజు దిశ అత్యాచారం, హత్య ఘటనపై అట్టుడికిపోయింది. జీరో అవర్ సమయంలో రాజ్యసభలో దీనిపై చర్చ జరిగింది. ఆ తరువాత మధ్యాహ్నం సమయంలో లోక్ సభలో దిశ అత్యాచారం ఘటనపై చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, వేధింపులు తదితర అంశాలపై సీరియస్ గా చర్చ జరుగుతున్న సమయంలో...ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిర్యాదులకు సంబంధించి.. "0" (జీరో) ఎఫ్ఐఆర్ అమలు చేయాలంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీచేశారు.
దిశ దారుణ అత్యాచారం, హత్య ఉదంతంలో సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. దిశ తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదని పోలీసులను ఆశ్రయించగా...తమ పరిధిలోకి రాదంటూ పోలీసులు చెప్పారు. దీంతో తాము అనేక స్టేషన్లకు తిరిగామంటూ వారు వాపోయారు. అయితే, అంతర్గత విచారణ చేసిన పోలీసు శాఖ అందుకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేసింది. తెలంగాణలో జరిగిన ఈ ఘటన నేపథ్యంలో..ఏపీ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు తరువాత క్రిమినల్ లా లో ప్రవేశపెట్టిన "జీరో ఎఫ్ఐఆర్నును అమలులోకి తెచ్చింది. ఈ రూల్ ప్రకారం దగ్గర్లో ఉన్న ఏ స్టేషన్లోనైనా కంప్లైంట్ ఫైల్ చెయ్యెచ్చు. దానిపై తక్షణ విచారణ జరిపిన అనంతరం, ఆ ప్రాంత పరిధిలోని పోలీస్ స్టేషన్కు కేసు బదిలీ చెయ్యాల్సి ఉంటుంది.
జీరో ఎఫ్ఐఆర్ నిబంధనల ప్రకారం, రాష్ట్ర లేదా జిల్లాలోని ఏదైనా పోలీస్ స్టేషన్లో ఏదైనా సమాచారం గుర్తించబడితే నేరం జరిగిన అధికార పరిధిలోని పోలీస్ స్టేషన్ కాకపోయినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. అనంతరం సంబంధిత పోలీసు అధికారి జీరో ఎఫ్ఐఆర్ ను సరైన అధికార పరిధిలోని పోలీసు స్టేషన్కు బదిలీ జరిగేలా చూడాలి. అధికార పరిధి (ఎక్కడైనా) ఎఫ్ఐఆర్, ఫిర్యాదు రసీదు ఆధారంగా జీరో ఎఫ్ఐఆర్ నమోదుకు పోలీసు అధికారికి అధికారం ఇస్తుంది. ‘జీరో’ ఎఫ్ఐఆర్ విధానం ప్రస్తుతం ఢిల్లీ, ముంబైలో అమలులో ఉంది.