సూప‌ర్ ఫాస్ట్ మోడ్‌లోకి చిరంజీవి


మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమా విష‌యంలో స‌స్పెన్సుకు తెర‌ప‌డింది. ఆచార్య త‌ర్వాత ఆయ‌న మ‌ల‌యాళ మూవీ లూసిఫ‌ర్ రీమేక్‌లోనే న‌టించ‌నున్నారు. దీనికి ద‌ర్శ‌కుడు కూడా ఖ‌రార‌య్యాడు. కొన్ని రోజుల కింద‌ట ప్ర‌చారంలోకి వ‌చ్చిన మోహ‌న్ రాజా పేరే ఖ‌రారైంది. తెలుగువాడైన మోహ‌న్ రాజా.. త‌మిళంలో ద‌ర్శ‌కుడిగా మంచి పేరే సంపాదించాడు. ఒక‌ప్ప‌టి ప్ర‌ముఖ ఎడిట‌ర్, త‌ర్వాత నిర్మాత‌గా ఎదిగిన మోహ‌న్ త‌న‌యుడే ఈ రాజా.

తెలుగులో ఇంత‌కుముందు హ‌నుమాన్ జంక్ష‌న్ లాంటి హిట్టు సినిమా తీశాడు. కెరీర్లో చాలా వ‌ర‌కు రీమేక్‌లే తీసి విజ‌యాలందుకున్న రాజా.. ఒరిజిన‌ల్ స్క్రిప్టుతో తీసిన త‌నీ ఒరువ‌న్‌తో సెన్సేష‌న‌ల్ హిట్ కొట్టాడు. అక్క‌డి నుంచి అత‌డి స్థాయి పెరిగింది. చివ‌ర‌గా వేలైక్కార‌న్ అనే సినిమాతోనూ మ‌రో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు లూసిఫ‌ర్ రీమేక్‌తో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఒరిజిన‌ల్‌ను యాజిటీజ్ దించేయ‌కుండా తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్లు లూసిఫ‌ర్‌లో మార్పులు చేర్పులు చేశాడ‌ట మోహ‌న్ రాజా. స్క్రిప్టు ఇప్ప‌టికే రెడీగా ఉంద‌ని నిర్మాత‌ల్లో ఒక‌రైన ఎన్వీ ప్ర‌సాద్ ప్ర‌క‌టించారు.

ఈ సినిమా షూటింగ్ వివ‌రాల‌ను చిరునే స్వ‌యంగా వెల్ల‌డించాడు. సంక్రాంతి పండుగ త‌ర్వాత ఫిబ్ర‌వ‌రి ఆరంభంలో సెట్స్ మీదికి వెళ్తుంద‌ట ఈ చిత్రం. ఏప్రిల్ క‌ల్లా చిత్రీక‌ర‌ణ పూర్తి చేస్తార‌ట‌. అంటే మూడే మూడు నెల‌ల్లో సినిమా అయిపోతుంద‌న్న‌మాట‌. గ‌త రెండు ద‌శాబ్దాల్లో చిరు ఇంత వేగంగా మ‌రే సినిమా చేసి ఉండ‌రేమో. రీమేక్ కావ‌డం, పైగా కోవిడ్ కాలంలో చిత్రీక‌ర‌ణ‌లు త‌క్కువ కాస్ట్ అండ్ క్రూతో వేగంగా చేసేస్తున్న నేప‌థ్యంలో చిరు బృందం కూడా ప‌క్కా ప్ర‌ణాళిక‌తో రంగంలోకి దిగుతున్న‌ట్లుంది.

ఆచార్య పూర్తి చేశాకే చిరు ఈ సినిమాను మొద‌లుపెట్టే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ క‌ల్లా షూటింగ్ అయిపోతుందంటే.. ఆచార్య‌, ఈ సినిమా త‌క్కువ వ్య‌వ‌ధిలోనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తాయ‌న్న‌మాట‌.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.