టీడీపీలో మిగిలేది నలుగురేనట... నమ్మరే??

September 22, 2020
CTYPE html>
ఏపీలో అధికార పార్టీ వైసీపీలో కీలక నేతగా, జగన్ సర్కారులో ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా కొత్త బాధ్యతలు ఎత్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి మొన్నటిదాకా మీడియా ముందుకే వచ్చేవారు కాదు. అయితే ప్రభుత్వ సలహాదారుగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తరచూ మీడియా ముందుకు వస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం కూడా ఆయన మీడియా ముందుకొచ్చి సంచలన వ్యాఖ్యలే చేశారు. ఈ వ్యాఖ్యల్లో ఏ మేర నిజముందన్న విషయాన్ని పక్కనపెడితే... ఆయన చేసిన వ్యాఖ్యలే కామెడీగా మారిపోయాయన్న వాదన వినిపిస్తోంది. 
సజ్జల తాజా మీడియా మీట్ లో ఏమన్నారన్న విషయానికి వస్తే... ఏపీ అసెంబ్లీలో ప్రస్తుతం టీడీపీకి 23 మంది సభ్యులున్న సంగతి తెలిసిందే. వారిలో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీకి దూరం కాగా... నికరంగా మిలిగింది మాత్రం 21 మందే. వారిలో కూడా ఏకంగా 17 మంది ఎమ్మెల్యేలు వైసీపీతో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సజ్జల కామెంట్ చేశారు. 21 మందిలో ఏకంగా 17 మంది వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉంటే... ఇక టీడీపీలోనే కొనసాగే ఎమ్మెల్యేలు కేవలం నలుగురు మాత్రమేనట. ఆ నలుగురు ఎవరన్న విషయాన్ని గానీ, వైసీపీతో టచ్ లో ఉన్న17 మంది ఎమ్మెల్యేలు ఎవరన్న విషయాన్ని గానీ చెప్పకుండా సజ్జల నేల విడిచి సాము చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. 
సజ్జల నోట నుంచి వెలువడ్డ ఈ కామెంట్లే కామెడీ అనుకుంటే.. ఈ కామెడీని మించిన వ్యాఖ్యలు సజ్జల వినిపించారు. టీడీపీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలతో పాటు టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్సీలు కూడా తమతో టచ్ లో ఉన్నారని చెప్పారు. అయితే వీరిలో ఏ ఒక్కరిని కూడా తమ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని కూడా సజ్జల సెలవిచ్చారు. అయినా చేర్చుకోని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో టచ్ లో ఉండటమేంటో అర్థం కావడం లేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఎంతసేపూ విపక్షంపై మైండ్ గేమ్ ఆడటం మినహా... సజ్జల చేస్తున్న ఈ తరహా కామెంట్లు నిజంగానే కామెడీగా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.