ఈ డేరింగ్ ఏంటి రాజమౌళి సార్ ??

September 23, 2020

రాజమౌళి మీద ప్రగాఢ నమ్మకంతో అసాధారణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు డీవీవీ దానయ్య. భారతీయ సినిమా చరిత్రలోనే రెమ్యునరేషన్లలో ఒక కొత్త అధ్యాయానికి తెరతీశాడు నిర్మాత దానయ్య. ఇదంతా కేవలం రాజమౌళిని చూసుకునే అనడంలో ఏ సందేహం లేదు. ఇంతకీ దానయ్య చేసిన ధైర్యం ఏంటంటే.... ఇప్పటికీ ఇండియన్ సినిమాలో హీరోకు 30 కోట్ల పారితోషికం  ఏమీ చిన్న అమౌంట్ కాదు. అలాంటి... కేవలం అతిథి పాత్రకు 30 కోట్ల పారితోషికం ఇవ్వడానికి దానయ్య రెడీ అయ్యారు. బహుశా ఈ నిర్ణయం రాజమౌళిదే అయ్యుండొచ్చు. కాకపోతే డబ్బులిచ్చేది మాత్రం దానయ్యే కదా.

రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న RRR సినిమాలో అజయ్ దేవ్ గణ్ ది అతిథి పాత్ర. అయితే, కీలకమైన పాత్ర. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళే వెల్లడించారు. అయితే, తాజాగా ఒక సంచలన విషయం బయటకు వచ్చింది. 45 నిమిషాల కంటే తక్కువ సమయంలో మాత్రమే ఉండే ఫ్లాష్ బ్యాక్ లో మహా అయితే 20 నిమిషాలు కనిపించే పాత్రకు 30 కోట్ల రూపాయలు ఇవ్వడం ఇండియన్ ఇండస్ట్రీ రికార్డు. అయితే... ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యం వల్ల, దానికి అజయ్ దేవ్ గణ్ న్యాయం చేస్తాడని, పాన్ ఇండియాలో అజయ్ దేవ్ గణ్ పాత్ర చరిత్ర సృష్టిస్తుందని భావించి 30 కోట్లు పెడితే 300 కోట్లు వస్తుందనే ఉద్దేశంతో ముందు వెనుక చూడలేదని తెలుస్తోంది.