ఏపీ రాజధానిపై జగన్ సంచలనం

September 21, 2020

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏపీలో అత్యధికులకు రాజధానిగా అమరావతి ఉంటుందా? అన్న అనుమానం వచ్చింది. ప్రభుత్వ చర్యలు కూడా దానికి అనుగుణంగానే ఉన్నాయి. పట్టణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ద్వారా ప్రభుత్వం రాజధాని అమరావతిపై అనేక అనుమానాలు కలిగేలా ప్రకటనలు చేయించింది. ప్రజలు రాజధాని గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికే ఆ ప్రకటనలు చేయించారని విశ్లేషకులు అంచనా వేశారు. ఈరోజు జగన్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. వారి అంచనా నిజమేనా అనిపించక మానదు.

రాజధాని గురించి కమిటీ వేసిన జగన్ .. ఆ నివేదిక రాకమునుపే అందులో ఏముంటుందో వెల్లడించేశాడు. సౌతాఫ్రికా మోడల్ లో ఏపీ రాజధానిని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందనుకుంటున్నట్లు తెలిపారు. చట్టసభలు అన్నీ అమరావతిలో కొనసాగిస్తారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అంటే... ఫైనాన్స్ అండ్ ఎంప్లాయిమెంట్ క్యాపిటల్ గా విశాఖపట్నం ఎంచుకుంటారు. హైకోర్టు ఇంకొన్ని ముఖ్య విభాగాలను రాయలసీమ ప్రాంతంలోని కర్నూలులో పెడితే బాగుంటుందని ముఖ్యమంత్రి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ నియమించిన కమిటీ కచ్చితంగా ఆయన అభిప్రాయాలకు అనుగుణంగానే ఉండే అవకాశం ఉంది కాబట్టి... ఈరోజు అసెంబ్లీలో ప్రకటించిన విషయాలే రేపు నివేదికలో కూడా రావచ్చు. అంటే అమరావతి అనేదే ప్రధాన రాజధాని వెలుగొందనుంది. రాజకీయ, కార్యనిర్వహక వర్గానికి ఇదేకేంద్రం కానుంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖపట్నం ఉపాధి, ఉద్యోగ కేంద్రంగా తీర్చిదిద్దాలని జగన్ భావిస్తున్నట్లు అర్థమవుతోంది. 

ఏది ఏమైనా... అందరూ ప్రచారం చేసిన దొనకొండ ప్రాంతం ఊసులో కనిపించేలా లేదు. అయితే దాని గురించి జగన్ ప్రస్తావించకపోయినా రేపు నివేదికలో దానిని పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సూచనలు వచ్చినా ఆశ్చర్యం లేదు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.