అధికార అహం, మాజీ సీఎంపై వైసీపీ ఎమ్మెల్యే బండబూతులు

September 23, 2020

రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. ఇటీవలి కాలంలో రాజకీయ విలువలు దారుణంగా దిగజారిపోయాయనే చెప్పవచ్చు. ప్రజలకు మంచి చేసే ఉద్దేశ్యంలో భాగంగా అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధం జరిగేది. ఎవరికి వారు.. తాము చేసేదే కరెక్ట్ అనుకోవడం వేరే విషయం. ప్రస్తుత రాజకీయాల్లో తిట్లు, ఒకరిపై మరొకరు చేయి చేసుకోవడాలు ఎక్కువగా వింటున్నాం. తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది రాజకీయ నాయకులు హద్దు మీరుతున్నారు. ఏదో వ్యక్తిగత కక్షలు ఉన్నట్లుగా తిట్ల దండకం అందుకుంటున్నారు.

తాజాగా, వైసీపీ తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ టీడీపీ అధినేత చంద్రబాబుపై తిట్ల వర్షం కురిపించారు. రాజధాని అమరావతి నుండి ఏ అంశం తీసుకున్న అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సహజం. కానీ ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదిన్నర సంవత్సరాలు, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లు సీఎంగా ఉన్న ఓ వ్యక్తిపై ఏ ఒక్కరు హర్షించలేని విధంగా తిట్ల దండకం వినిపించారు. కొన్ని సందర్భాల్లో రాయలేని పదజాలం ఉపయోగించారు. ఆయన మాటలు విని స్వయంగా వైసీపీ నాయకులే నోరెళ్ల బెడుతున్నారట.

చంద్రబాబు వంటి సీనియర్ నేతను వెదవన్నర వెదవ అంటూ విమర్శించారు. కమ్మ కులాన్ని అడ్డు పెట్టుకొని అమరావతి జేఏసీ ముసుగుతో ఉద్యమాలు చేస్తున్నారన్నారు. ఈ ఉద్యమంలో ఉన్నవారంతా కమ్మవాళ్లే అన్నారు. బలవంతంగా వస్తే తాను ఏం చేసేవాడినో చూపించేవాడినన్నారు. అమరావతి ఉన్న నియోజకవర్గంలో, ఆ పక్కన మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ నుండి ఎమ్మెల్యేలు గెలిచారన్నారు. తన తండ్రి నా పార్టీలో ఉన్నారని చంద్రబాబు సభలో చెబుతున్నారని కానీ అది చంద్రబాబు పార్టీ కాదని, ఎన్టీఆర్ స్థాపించారని చెబుతూ తీవ్రంగా దూషించారు. ఆయన ఇష్టారీతిన మాట్లాడిన మాటలు ఇక్కడ రాయలేని విధంగా ఉన్నాయి.

ఇదంతా ఒకెత్తు... కుల రాజకీయాన్ని రంగరించి పండించడం మరొకెత్తు. అమరావతి ఉద్యమాన్ని కమ్మ ఉద్యమంగా పేర్కొంటూ... చంద్రబాబుకు మద్దతు ఇస్తే... మీ కథ అంతే అన్నట్టు మీడిమా ముఖంగా బెదిరించారు.  తెనాలి డివిజన్‌లోని కమ్మలకు అందరికీ చెబుతున్నానని, జగన్మోహన్ రెడ్డి గారు తనకు కమ్మ ప్రతినిధిగా శాసన సభ్యుడిగా అవకాశమిచ్చారని, ఎవరికైనా ఇబ్బంది ఉంటే వాళ్లకు కూడా పని చేసి పెట్టమని చెప్పాడని, తాను కమ్మ ప్రతినిధిగా చెబుతున్నానని, చంద్రబాబు లేదా ఆలపాటి రాజా మాటలు నమ్మి మీరు జేఏసీ ముసుగులో తెనాలిలో ఆందోళనలు చేస్తే మీ జీవితాలు నాశనమవుతాయన్నారు. ఇంత పచ్చిగా బెదిరిస్తున్నారంటే... ఆ ఎమ్మెల్యే ఎంతకు తెగించారో అర్థమవుతోంది. 

ఆయన మాటలు వింటంటే....  ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కూడా చేసుకునే హక్కులేదన్నట్లుగా ఉన్నాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇతరులకు భంగం కలిగించకుండా, హింసలేకుండా ఆందోళనలు, నిరసనలు చేపట్టే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఎమ్మెల్యే మాత్రం జేఏసీ ముసుగులో ఆందోళనలు చేస్తే జీవితాలు నాశనమవుతాయని హెచ్చరికలు జారీ చేయడం ఏమిటని అందరూ నోరెళ్లబెడుతున్నారు.

పైగా ఎమ్మెల్యే... మాజీ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు, ఓ వర్గాన్ని బెదిరించేట్లుగా మాట్లాడుతుంటే చుట్టూ ఉన్నవారు చప్పట్లు కొడుతూ ప్రోత్సహించడాన్ని కూడా తీవ్రంగా తప్పుబడుతున్నారు. అధికారంలో ఉన్నంత మాత్రాన ఓ సీనియర్ నేతపై పరుషజాలం ఉపయోగించడం, నియోజకవర్గంలోని కొంతమందిని ఆందోళనల్లో పాల్గొనవద్దని బెదిరించడం అధికార అహంకారమేనని అంటున్నారు. ముసలి.. సిగ్గుండాలి.. అంటూ చంద్రబాబుపై రాయలేని భాషలో తిట్ల దండకం కురిపించారు. ఓ సమయంలో చంద్రబాబు సంస్కారం ఇదేనా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. అసలు ఈయన ఏ మేరకు సంస్కారవంతంగా మాట్లాడారో చెప్పాలని దుయ్యబడుతున్నారు.

రాజకీయాల్లో తాను నైతిక విలువలు పాటిస్తానని చెబుతూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్... స్వయంగా తన పార్టీ ఎమ్మెల్యే నాలుగు పదులకు పైగా రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుపై ఇంత దారుణ పదజాలం ఉపయోగించినందుకు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. ఆయనపై చర్యలు తీసుకుంటే జగన్ చెప్పిన నైతిక విలువలకు అర్థం ఉంటుందనే చెప్పవచ్చు.