కాల్‌మ‌నీలో పెట్రోల్ క‌ల‌క‌లం... జగన్, రోజా ఎక్కడున్నారు?

September 24, 2020

కాల్ మ‌నీ...ఏపీలో రాజ‌ధాని ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రిగిన ఈ అవాంచ‌నీయ వ్యాపార దోర‌ణి గురించి గ‌తంలో...ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైసీపీ ఓ రేంజ్‌లో గ‌గ్గోలు పెట్టింది. అధికార తెలుగుదేశం పార్టీపై దుమ్మెత్తిపోసింది. ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అయితే...పెద్ద ఉద్య‌మ‌మే లేవ‌నెత్తారు. అయితే, ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. మ‌రి ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపిందా? అంటే అలాంటిదేం జ‌ర‌గ‌లేదు. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకునేందుకు యత్నించాడు. కాల్‌మనీ పేరుతో అప్పు ఇచ్చిన వ్యక్తి అధిక వడ్డీతో వసూలు చేస్తున్నాడని, ఆ ఇబ్బందులు తట్టుకులేక పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు కూడా పట్టించుకోకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. కొద్దిరోజుల కింద‌ట ఓ మ‌హిళ సైతం ఇలాగే ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించింది.
గుంటూరు జిల్లా ఉండవల్లికి చెందిన వెంకట్.. గోపాలం సాంబశివరావు అనే వ్యక్తి దగ్గర రూ.6 లక్షల అప్పు తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన సాంబ‌శివ‌రా తొలుత 3 రూపాయలు వడ్డీ అని ఆ తర్వాత కాల్ మనీ పేరుతో  12 రూపాయలు వసూలు  చేస్తున్నాడని వెంకట్ ఆవేదన వ్యక్తం చేశాడు. అలా తన దగ్గర రూ.6 లక్షల అప్పు తీసుకొని రూ.23 లక్షల వరకూ వడ్డీ కట్టించుకున్నాడని వెంకట్ తెలిపాడు. అదీ చాలక మిగిలిన బాకీ డబ్బులు కూడా ఇవ్వాలని లేకపోతే అంతు చూస్తానని,  పోలీసులకు చెబితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయంటూ గోపాలం బెదిరించాడని వెంకట్ తన బాధను వెళ్లగక్కాడు. ఈ విషయంపై ఫిర్యాదు చేసినప్ప‌టికీ ఎలాంటి స్పందన లేదంటూ అవేదన వ్యక్తం చేశాడు. స్టేషను ముందే పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకునేందుకు బాధితుడు యత్నించడంతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆరు లక్షలు వడ్డీకి ఇచ్చి వ్యాపారి.. ఇంట్రెస్ట్‌ రూపంలోనే 23 లక్షలు వసూలు చేశారంటే...ఆయ‌న ఎంత ముదురో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బాధితుడు పెట్రోల్ పోసుకొని చ‌చ్చిపోయేందుకు సిద్ధ‌మ‌య్యాడంటే...ఆయ‌న బాధ గురించి కూడా...వివ‌రించాల్సిన అవ‌స‌రం లేదు. మ‌రి మీడియాలో పెద్ద ఎత్తున వైర‌ల్ అయిన ఈ ఘ‌ట‌న‌పై వైసీపీ స్పంద‌న ఏంటి?  కాల్‌మ‌నీపై స్పందించిన వైసీపీ నేత‌ల జాడేది?  వారి చిత్త‌శుద్ధి కాల్‌మ‌నీని అరిక‌ట్టాలనా అప్ప‌ట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని ఇర‌కాటంలో ప‌డేయాలనా? ప‌్ర‌జ‌లే ఆలోచించుకోవాలి!