జగన్ మూడు ముక్కలాట ప్రీ ప్లాన్డ్ యే ... !

September 22, 2020

ఏపీలో ప్రస్తుతం రచ్చ రచ్చగా సాగుతున్న మూడు రాజధానుల కుట్ర అసలు రంగు బయటపడిపోయింది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను సీఎం కాగానే ఈ కుట్రకు తెర తీయగా... అందులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా మరో ప్రధాన కుట్రదారుగా ఉన్నారన్న విషయం కూడా బయటపడిపోయింది. ఇదేదో ఇప్పుడే బయటపడిన నిజం ఎంతమాత్రం కాదు... నాలుగు నెలల క్రితమే... రాయలసీమకు చెందిన కీలక రాజకీయవేత్త, బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ దీనిని బయటపెట్టేశారు. ఎన్నికల దాకా టీడీపీలోనే కొనసాగిన టీజీ... ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు కాగానే... తన స్వార్థ ప్రయోజనాల కోసం సుజనా చౌదరి, సీఎం రమేశ్ లతో కలిసి బీజేపీలోకి జంప్ కొట్టిన సంగతి తెలిసిందే. అంటే... బీజేపీ నేతగా మారిన తర్వాతే టీజీ వెంకటేశ్... ఇటు జగన్ తో పాటు అటు మోదీ కూడా అమరావతిపై ప్రీ ప్లాన్డ్ గా సాగించిన కుట్రను బయటపెట్టేశారు. 

టీజీ బయటపెట్టిన విషయమేమిటంటే... జగన్ సీఎం కాగానే తొలిసారిగా ఢిల్లీ వెళ్లి మోదీని కలిశారు కదా. ఆ సమయంలోనే తాను ఏపీ రాజధానిని అమరావతిలో ఉంచడం లేదని, అమరావతిలోని రాజధానిని మూడు మక్కలు చేసి నాలుగు రాజధానులు ఏర్పాటు చేస్తానని మోదీ సహా... బీజేపీ పెద్దలకు చెప్పారట. అయితే అప్పటికే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై ఓ రకమైన పగను పెంచేసుకున్న మోదీ అండ్ కో... జగన్ ప్లాన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి కుట్రలో భాగం పంచుకున్నారట. నాడు ముందస్తుగానే రూపొందించుకున్న ప్లాన్ ను జగన్ కాస్తంత ఆలస్యంగా... అది కూడా ముందుగా నిర్ణయించుకున్న కాలానికే అమలు చేయడం మొదలుపెట్టేశారు. నిజమే మరి... జగన్, మోదీ వేసిన ఈ ప్లాన్ ను టీజీ వెంకటేశ్... ఆగస్టు 26ననే ట్విట్టర్ వేదికగా బయటపెట్టేశారు.

అయినా ఇందులో జగన్ కుట్ర ఓకే గానీ... మోదీ కుట్ర ఏమిటనేగా మీ డౌటు? తెలుగు నేల విభజన జరిగిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన మోదీ... తన హామీని తుంగలో తొక్కేశారు. ఆ తర్వాత అమరావతిలో చంద్రబాబు కట్టనున్న నవ్యాంధ్ర రాజదానికి కూడా శంకుస్థాపన స్వయంగా తన చేతులతోనే వేసిన మోదీ... రాజధాని నిర్మాణానికి నిధుల విడుదలలో తనదైన శైలి మంత్రాంగం నెరిపారు. మోదీ చేసిన ఈ మోసాన్ని చంద్రబాబు జనంలోకి బాగానే తీసుకెళ్లారు. మొత్తంగా చంద్రబాబు చేసిన ఈ ప్రచారం వల్ల మోదీపై ఏపీ ప్రజల్లో ఓ మోసగాడి ముద్ర పడింది. ఈ ముద్రను తొలగించుకోవాలంటే... అమరావతిలో రాజధాని లేకుండా చేస్తే సరిపోతుంది కదా. ఈ దిశగా మోదీ ఆలోచిస్తున్న సమయంలోనే జగన్ ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టడం, ఆ వెంటనే తన తొలి ఢిల్లీ పర్యటనలోనే రాజధానిని మారుస్తానని చెప్పడంతో... తాను అనుకున్న పనిని జగన్ చేస్తానంటే మోదీ కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. అంటే... రాజధానిపై జగన్ తో పాటు మోదీ కూడా కుట్రదారే కదా.