రాజధాని తరలింపులో గేమ్ ప్లాన్ పార్ట్ 1 ఇదే

September 21, 2020

రాజధానిపై రచ్చపై, అమరావతి రైతుల వేదనపై వైసీపీ ఎంపీ రఘురామ కృషంరాజు స్పందించారు. రాజధాని మార్పు వార్తలు సహజంగానే రైతులకు ఆందోళన కలిగిస్తాయన్న ఆయన ... రైతులకు అన్యాయం జరగుతుందని తాను అనుకోవడం లేదని, ఎందుకంటే ఆ కమిటీ సిఫార్సులను ఇంకా కేబినెట్ ఆమోదించాల్సి ఉందని ఆయన అన్నారు. అదే సమయంలో అమరావతితో పాటు విశాఖ రాజధానిగా ఉంటుందన్నారు. వైసీపీ ఎంపీ మాటల్లోనే వైరుధ్యం కనిపిస్తోంది. కమిటీ నివేదికను కేబినెట్ ఆమోదించాల్సి ఉందని ఒకవైపు చెబుతూనే మరోవైపు ’వైజాగ్ తో పాటు అమరావతి రాజధానిగా‘ ఉంటుందని చెప్పడం ఏంటి? ఇది కేబినెట్ ఆమోదించాక చెప్పాల్సిన మాట కదా. మాటకు మాటకు పొంతన లేకుండా వైసీపీ నేతలు ప్రజల ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు. తనకైతే ఇంకా రాజధాని తరలింపుపై క్లారిటీ రాలేదని మరో మాట చెప్పారు. రఘు రామ కృష్ణంరాజు మాటలను విశ్లేషిస్తే... రాజధాని మార్పు ఖాయమని అందులో ఉంది. రాజధాని మార్చడం ఖాయమే గాని రైతులకు అన్యాయం చేయరు అన్న మాట కూడా ఆయన మాటల్లో వెల్లడవుతోంది. ప్రధానమైన రాజధాని వైజాగ్ మాత్రమే.. అమరావతి కాదు అనే మాట కూడా ఆయన మాటల్లో తెలిసొస్తుంది. 

జగన్ వ్యవహారం చూస్తుంటే మొత్తం తేడాగా ఉంది. రాజధాని గురించి ముందు నుంచి చేసిన ప్రకటనలు, ఆ తర్వాత అసెంబ్లీలో చివరి రోజున చెప్పడం, అవే విషయాలు తు.చ. తప్పకుండా నివేదికలో రావడం ఇవన్నీ చూస్తుంటే... ఇదంతా ఒక గేమ్ లాగా అర్థమవుతోంది. రాజధాని మార్చాలని ఉన్నా కూడా అది చాలా సంక్లిష్టంగా ఉంది. వీలైనంత తక్కువ డ్యామేజీతో మార్చడానికి ప్రజల స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి, వైసీపీ నేతలు ఒక డ్రామా ప్లే చేస్తున్నారు. వ్యతిరేకత తీవ్రంగా ఉంటే నిర్ణయం ఒకలాగా, పెద్దగా వ్యతిరేకత లేకపోతే నిర్ణయం ఇంకోలా తీసుకోవడానికి ప్లాన్ చేయడం వల్లే ఈ లీకులు అన్నీ చేస్తున్నట్టు గ్రహించొచ్చు. ఇదంతా చూస్తుంటే... ఎమోషన్లను అంచన వేయడం రాజధాని తరలింపులో మొదటి దశ అనుకోవచ్చు. వైసీపీ చాలా వ్యూహాత్మకంగా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటోంది. 

వాస్తవానికి తెలుగుదేశం పార్టీ న్యాయస్థానాలను సరిగా సద్వినియోగం చేసుకోవడం లేదు గాని... అమరావతి ని ఇంచు కూడా కదలకుండా చేసే అనేక మార్గాలున్నాయి. జగన్ తప్పులు చేస్తే మేం హీరోలవుతాం అని చూడటమే తప్ప, జగన్ ను నిలువరించే ప్రణాళకి సరైనది ఏదీ టీడీపీ వద్ద ఉన్నట్టు లేదు. అందుకే సాధారణ వైసీపీ నేతలు కూడా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టగలుగుతున్నారు.