రాజుకు నచ్చింది రంభ- మండ‌లి ర‌ద్దుకు కేబినెట్ ఆమోదం

September 21, 2020

ఏపీ శాస‌న‌ మండలి కథ  ముగిసింది. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి సార‌థ్యంలో స‌మావేశ‌మైన  ఏపీ మంత్రివర్గ సమావేశంలో శాసనమండలిని రద్దు చేస్తూ సంచ‌ల‌న‌ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి మండలి భేటీ తర్వాత శాసనసభలో తీర్మానం చేయ‌నున్నారు. తీర్మానం ఆమోదం పొందిన వెంటనే కేంద్రానికి పంపించ‌నుంది ఏపీ ప్ర‌భుత్వం. ఈ చ‌ర్య చ‌ర్చ‌నీయాంశంగా మారింది.
కాగా, గ‌త గురువారం అసెంబ్లీలో మండ‌లి ర‌ద్దు ప్రస్తావన వచ్చింది. మండలి అవసరమా అనే చర్చ వాదనలు వినిపించాయి. దీనిపై, మండలి రద్దే బెటర్ అనే సూత్ర‌ప్రాయ నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. అనంత‌రం నేడు జ‌రిగిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర కేబినెట్ దీనిపై నిర్ణ‌యం తీసుకుంది. ఉదయం తొమ్మిదిన్నరకు కేబినెట్ భేటీలో మండలి రద్దు తీర్మానానికి ఆమోదం తెలిపిన‌ట్లు స‌మాచారం. రాష్ట్ర మంత్రులంతా సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యానికి సంఘీభావం తెలిపిన‌ట్లు స‌మాచారం. కాగా, అనంతరం రద్దు చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టి సభలో ఆమోదం తెల్పనున్నారు.
ఇదిలాఉండ‌గా, అసెంబ్లీ ఆమోదం ఆ తర్వాత తీర్మానం కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. దీన్ని బిల్లు రూపంలో లోక్‌సభ, రాజ్యసభలో పెట్టాల్సి ఉంటుంది. దీన్ని మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదించిన తర్వాత, రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడితే ఆరోజు నుంచి మండలి రద్దు అవుతుంది.