రుణాల కోసం జగన్‌ ప్రభుత్వం వెంపర్లాట

September 22, 2020

పింఛన్లు ఇవ్వడానికీ డబ్బు లేదు
అత్యవసర ఖర్చులకూ దిక్కులేదు
62 వేల కోట్ల అప్పు తేవడమే లక్ష్యం

‘అప్పు చేసి పప్పుకూడు తినేందుకు నేను వ్యతిరేకం. నేను సీఎం కుర్చీలో కూర్చుంటే.. పరిపాలన ఎలా ఉండాలో చూపిస్తా. చంద్రబాబులా వృధా ఖర్చులు చేయను.. ప్రజల సొమ్ము ప్రజలకే ఖర్చుపెడతా’ అని వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సందర్భంగా పదేపదే ప్రకటించారు. ఎలాగైతేనేం ఆ పదవి సాధించి ఆ కుర్చీలో కూర్చున్నారు. తాను చెప్పినదానికి విరుద్ధంగా చేస్తున్నారు. పీపీఏల రద్దు పేరిట, రివర్స్‌ టెండరింగ్‌ పేరిట ఇన్వెస్టర్లను, కాంట్రాక్టర్లను, వారికి అప్పులిచ్చిన బ్యాంకులను బెంబేలెత్తిస్తున్నారు. చివరకు ప్రభుత్వానికే అప్పుపుట్టని పరిస్థితి ఏర్పడింది. అప్పుచేస్తే తప్ప నవరత్న పథకాలు అమలుచేసే పరిస్థితి లేదు. దేవాదాయ భూములు, యూనివర్సిటీల భూములు అమ్మి పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలనుకుంటున్నారు. విమర్శలు వస్తుండడంతో వెనకడుగు వేస్తున్నారు. చివరకు పరిస్థితి ఎలా తయారైందంటే.. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలివ్వడానికి ఖజానాలో చిల్లిగవ్వ లేదు. పెన్షనర్లకు కూడా పైసా ఇవ్వలేని పరిస్థితి. అత్యవసర ఖర్చులకు సైతం చేయి ఆడడం లేదు. ఒక్క బ్యాంకు కూడా అప్పులివ్వడం లేదు. ఎంత వెంటపడుతున్నా ముఖం చాటేస్తున్నాయి. ఒకవేళ ఇస్తే ఎలా చెల్లిస్తారో చెప్పాలని భారతీయ స్టేట్‌బ్యాంకు (ఎస్‌బీఐ) నిలదీసే పరిస్థితి. టీడీపీ హయాంలో తెచ్చిన అప్పులను ప్రాజెక్టుల నిర్మాణానికి ఖర్చుచేసింది. జగన్‌ ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం ఉత్పాదకత లేని నవరత్నాల పథకాలకు వ్యయం చేస్తోంది. అప్పులతో ఆస్తులు సమకూరకపోగా.. ఉన్నవి అమ్ముకోవలసిన దుస్థితి దాపురించింది.  జగన్‌ గద్దెనెక్కిన తొలి ఏడాదిలోనే రూ.62 వేల కోట్ల అప్పు తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆర్‌బీఐ దయతో..
సంక్షేమం పేరిట తలకుమించిన ఖర్చులు పెడుతున్న జగన్‌ ప్రభుత్వం.. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) దయతో నాలుగు నెలలుగా నెట్టుకొస్తోంది. నవంబరు నెలలో వేతనాలు, పింఛన్లకు రూ.2,700 కోట్ల మేర అప్పుచేసింది. నవరత్నాల  అమలు కోసం చివరకు ఉద్యోగులను, రిటైరైన వారినీ నెలనెలా సతాయిస్తున్నారు. అక్టోబరు నెల జీతాలను విడతలవారీగా.. అంటే ఒక్కో శాఖ ఉద్యోగులకు ఒక్కో రోజు చొప్పున నవంబరు 21 వరకు జీతాలిస్తూనే ఉన్నారు. ఇప్పుడు నవంబరు నెల జీతాలు, పెన్షన్లు, ఖర్చుల కోసం ఆర్‌బీఐ కల్పించిన ప్రత్యేక నిధుల విడుదల సౌకర్యం (స్పెషల్‌ డ్రాయింగ్‌ ఫెసిలిటీ-ఎస్‌డీఎఫ్‌) పరిమితిని పూర్తిగా వాడుకుని.. 1,500 కోట్లు తెచ్చుకుంది. వేస్‌ అండ్‌ మీన్స ద్వారా రూ.1,200 కోట్లు వినియోగించుకున్నారు. ప్రతి నెలా వేతనాలు, పెన్షన్లకు రూ.5,500 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఇందులో సగం ప్రభుత్వం సొంత ఆదాయం నుంచి సమకూర్చుకుంటున్నారు. మిగతా సగాన్ని ఎస్‌డీఎఫ్‌, వేస్‌ అండ్‌ మీన్స ద్వారా అప్పు రూపంలో తీసుకుంటున్నారు. ఆర్‌బీఐ ద్వారా ఓపెన్‌ మార్కెట్లో బాండ్ల వేలంతో నవంబరు 26వ తేదీన రూ.1,500 కోట్లు, డిసెంబరు 3న ఇంకో రూ.510 కోట్లను ఆర్థిక శాఖ సమీకరించింది. బాండ్ల వేలం ద్వారా నిధులు సమీకరించే చాన్సు కూడా డిసెంబరు వరకే పరిమితం. ఆ తర్వాత ఆ అవకాశం లేదు. ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు రూ.29 వేల కోట్ల రుణాన్ని బాండ్ల వేలం ద్వారా తీసుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇందులో రూ.28 వేల కోట్లు ఇప్పటికే తెచ్చేశారు. మిగతా రూ.1,000 కోట్లను డిసెంబరు ముగిసేలోపు తీసుకోవాలి. ఇంకోవైపు.. జగన్‌  ప్రభుత్వం ఇతర శాఖల సొమ్ముపై కన్నేసింది. గ్రీన్‌ చానల్‌ పీడీ ఖాతాలను అందుబాటులోకి తెచ్చింది. చంద్రబాబు హయాంలో ఆయా శాఖల బిల్లులను బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లించేవారు. ఇప్పుడు వాటన్నిటినీ గ్రీన్‌చానల్‌ పీడీ ఖాతాలకు బదిలీ చేయాలని ఆదేశించారు. దీనివల్ల శాఖలు వాడకుండా ఉంచిన మొత్తం ఆర్థిక శాఖకు సంక్రమిస్తుంది. ముందు ఆ డబ్బును తాను వాడుకుంటుంది. తర్వాత ఆయా శాఖలు అడిగినప్పుడు ఇచ్చేందుకు గ్రీన్‌చానల్‌ పీడీ ఖాతాలు తీసుకొచ్చారు. అదే బ్యాంకు ఖాతాలకు చెల్లిస్తే.. ఆ నిధులను తిరిగి ఉపయోగించుకునే వెసులుబాటు ఉండదన్న మాట.

టీడీపీపై ఎన్నెన్నో ఆరోపణలు..
రాషా్ట్రన్ని అప్పులపాల్జేసిందని టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ నేతలు పదేపదే విమర్శలు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే అంతకు మూడు రెట్లు ఎక్కువగా రూ.62 వేల కోట్లు తేవాలని అనుకుంటున్నారు. దీనివల్ల నవ్యాంధ్ర కోలుకోలేనంతగా అప్పుల ఊబిలోకి కూరుకుపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో రెవెన్యూ లోటు ఉంది. కేంద్రం దానిని భర్తీ చేయలేదు. దీనికితోడు విభజన కష్టాలు ఎన్నో. అయినా రాజధాని అమరావతి, పోలవరం, ఇతర సాగునీటి ప్రాజెక్టులను చేపట్టింది. తెచ్చిన అప్పులతో అభివృద్ధి చేయడంతో ప్రభుత్వ ఆదాయం పెరిగింది. కానీ జగన్‌ ప్రభుత్వం ఆదాయం పెరిగే పనులేవీ చేయడం లేదు. పథకాల ప్రకటన తప్ప వాటికి ఎక్కడ నుంచి తెచ్చి ఇస్తారో చెప్పడం లేదు. పైగా ముందుగా పథకాలు ప్రకటిస్తూ.. ఆరు నెలల తర్వాత ఇస్తానని ముహూర్తాలు పెడుతోంది. టీడీపీ  హయాంలో ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పింఛను ఎప్పుడూ ఆపలేదు. వైసీపీ ఏలుబడిలో వారాల తరబడి ఆలస్యమవుతున్నాయి. ఇప్పటి పరిస్థితులే అప్పుడూ ఉన్నాయి. అయినా రెండంకెల వృద్ధి రేటు 3-4 శాతం మేర పడిపోయింది. ఆదాయం పెరగాలంటే పరిశ్రమలు, ప్రాజెక్టులు రావాలి. కానీ ఏవీ రావడం లేదు. వచ్చిన వాటిని కూడా వెళ్లగొడుతున్నారు. ‘ఏదేదో చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు ఊరించి ప్రజలను మోసం చేశారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండడంతో మళ్లీ పథకాల పేరుతో హడావుడి మొదలుపెట్టారు. ఈ ఎన్నికల తర్వాత ఆ పథకాలు ఏమవుతాయో ఎవరికీ తెలియదు’ అని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.