ఏపీని ముంచుతున్నది ఎవరో తెలిస్తే మీకు కోపం వస్తుంది

September 22, 2020

తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఎంత ముఖ్యమో.. విభజన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా అంతే ముఖ్యమని అన్ని పార్టీలు గంటాపథంగా చెప్పాయి ఆనాడు. కానీ ఐదేళ్లు తిరిగేసరిసి హోదా 'పూర్తిగా' ముగిసిన అధ్యాయంగానే కనిపిస్తోంది. ఏపీకి హోదా కావాల్సిందేనని కాంగ్రెస్, ఐదేళ్లు సరిపోదు పదేళ్లని కొట్లాడిన బీజేపీ, ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో ఈ నినాదం బలంగా వినిపించిన టీడీపీ, వైసీపీ, జనసేనలు ఇప్పుడు దీనిని పక్కన పెట్టినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

2014లో మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది నెలలకు ప్రత్యేక హోదా ఇవ్వలేమని, ప్యాకేజీయే బెట్టర్ అని, హోదా కంటే మంచి ప్యాకేజీ ఇస్తామని బీజేపీ చెప్పింది. నాడు వైసీపీ, జనసేన సహా విపక్షాలు భగ్గుమన్నాయి. ఆ సమయంలో హోదా కంటే ప్యాకేజీ బెటర్ అని బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న టీడీపీ చెప్పినప్పటికీ, 2019 ఎన్నికలకు కొన్ని నెలల ముందు మాత్రం యూటర్న్ తీసుకుందనే విమర్శలు ఎదుర్కొంది.

ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు హోదా కంటే ప్యాకేజీ బెటర్ అని, హోదా కంటే మెరుగైన ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెబుతోందని చెప్పిన టీడీపీ ఆ తర్వాత హోదా పేరెత్తడం గమనార్హం. హోదాపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కూడా 2019 ఎన్నికల్లో ఓటమికి ఓ కారణంగా చాలామంది భావిస్తున్నారు. సోషల్ మీడియా విస్తృతమైన ప్రస్తుత తరుణంలో నేతలు చేసిన వ్యాఖ్యలను, మార్చుతున్న మాటలను ఇట్టే పట్టేస్తున్నారు. కాబట్టి టీడీపీ యూటర్న్ ప్రజల్లో మైనస్ అయిందంటారు.

గత ఎన్నిలకు ముందే హోదా అంశాన్ని బీజేపీ, టీడీపీ పక్కన పెట్టగా, ఎన్నికల్లో అదే నినాదం బలంగా వినిపించిన వైసీపీ, జనసేనలు కూడా ఆ తర్వాత పక్కన పెట్టినట్లుగానే కనిపిస్తోందని అంటున్నారు. తమకు ఎక్కువ మంది ఎంపీలు ఉంటే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తామని జగన్, హోదాతోనే ఏపీకి సంపూర్ణ న్యాయమని అభిప్రాయపడిన పవన్ కళ్యాణ్‌లు ఈ అంశాన్ని పక్కన పెట్టారని అంటున్నారు.

22 మంది ఎంపీలు ఉన్నప్పటికీ జగన్ చేతులెత్తేశారని, మెడలు వంచి హోదా తెస్తానని చెప్పిన వైసీపీ అధినేత ఆ తర్వాత కేంద్రానికి సంపూర్ణ మెజార్టీ ఉందని, కానీ మనం ఏం చేయలేమన్నారు. ఆ వ్యాఖ్యల్లో పోరాడే ఉద్దేశ్యం కూడా కనిపించడం లేదనే వాదనలు వినిపించాయి. ఇటీవల బీజేపీతో దోస్తీ కుదుర్చుకున్న జనసేనాని.. హోదా గురించి ప్రశ్నిస్తే తొలి ఐదేళ్లు టీడీపీ, ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉందని, మొదట వారిని అడగాలని సూచిస్తున్నారు. కానీ హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన బీజేపీతో దోస్తీ అంటే ప్రస్తుతానికి పవన్ కమలం స్టాండ్ మీద ఉండాల్సిందేనని అంటున్నారు. మొత్తానికి హోదా ఇవ్వాల్సిన బీజేపీ, ఆ తర్వాత టీడీపీ, వైసీపీ, ఇప్పుడు జనసేనలు హోదా అంశాన్ని పక్కన పెట్టినట్లే కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.