వైజాగ్ కి వెళ్లే డేట్ ఫిక్స్... తర్వాతేంటి?

September 21, 2020

ఏపీ రాజధాని అమరావతి నుంచి విశాఖకు వెళ్లటం ఖరారైంది. అధికారికంగా ఇప్పటివరకూ ప్రకటించకున్నా.. ప్రభుత్వం తీసుకున్న లైన్ ప్రకారం.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు సమానంగా డెవలప్ కావాలంటే తప్పనిసరిగా మూడు రాజధానులు అవసరమని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నమ్ముతున్నారు. రాజధాని తరలింపుపై విపక్షాలు నిరసనలు.. ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో.. జరుగుతున్న పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తోంది ఏపీ అధికారపక్షం.
అదే సమయంలో తాము అనుకున్న రీతిలో రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నాల్ని మరోవైపు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అమరావతి నుంచి విశాఖకు రాజధాని తరలివెళ్లే డేట్ ను ఇప్పటికే ఫిక్స్ చేసినట్లుగా చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే.. ఈ నెల 20 నుంచి 25 మధ్యలో ఏదో ఒకరోజు విశాఖకువెళ్లటాన్ని ప్రకటిస్తారని చెబుతున్నారు.
సంక్రాంతి పండుగ తర్వాత అధికారిక ప్రకటన చేసినా.. దాని కంటే ముందే.. జరగాల్సిన ఏర్పాట్లను చేసేస్తున్నట్లు చెబుతున్నారు. పాలనను మరింత వేగవంతం చేయాలంటే అనుకున్నవి అనుకున్నట్లుగా జరగాలని.. అందుకు వేగవంతమైన నిర్ణయాలు అవసరమని భావిస్తున్న జగన్ సర్కారు.. అందుకు తగ్గట్లే ఏపీ రాజధానిని విశాఖకు తరలించే కార్యక్రమం మీద పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి రిపబ్లిక్ డే వేడుకల్ని కొత్త రాజధాని విశాఖలో నిర్వహించే వీలుందన్న మాట వినిపిస్తోంది.