అవార్డులొస్తే అది మీ ఘనత.. సమస్యలొస్తే చంద్రబాబు తప్పా?

September 25, 2020

ఏపీలో వరదలొస్తే అది చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పు.. ఇసుక కొరత ఏర్పడితే అదీ చంద్రబాబు తప్పే.. ఆశా వర్కర్లు జీతాలు అడిగితే అదీ చంద్రబాబు తప్పే.. విత్తనాల కొరత ఏర్పడితే అదీ చంద్రబాబు తప్పు.. ఒకటారెండా..? ఇప్పుడు కరెంటు లోటు ఏర్పడితే  నాలుగు నెలల కిందటవరకు 24 గంటల కరెంటు ఇచ్చిన చంద్రబాబు తప్పు.. ఇదీ ఏపీలో వైసీపీ మంత్రులు, ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలు.
అదేసమయంలో.. ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ పర్యటక అవార్డు.. సేంద్రియ వ్యవసాయంలో నంబర్ 1గా గుర్తింపు వచ్చాయి. ఈ అవార్డులు, గుర్తింపులను మాత్రం తమ ఖాతాలో వేసుకుంటోంది వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు. కానీ, వాస్తవ పరిస్థితులు చూస్తే ఏపీలో పాలన పడుతూలేస్తూ సాగుతోందన్న మాటే అంతటా వినిపిస్తోంది. మరి, ఈ అవార్డుల మాటేమిటి? ఇవన్నీ ప్రస్తుత ప్రభుత్వ ప్రతిభేనా?
ఇటీవల పర్యాటక దినోత్సవం రోజున ఏపీకి కేంద్రం పర్యాటక అవార్డు అందించింది. గోవాలాంటి పర్యాటక రాష్ట్రాలను కూడా దాటి దేశంలోనే అత్యుత్తమ పర్యాటక ప్రగతి సాధించిన రాష్ట్రంగా ఏపీ ఆ అవార్డు అందుకుంది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నుంచి ఆ అవార్డును స్వీకరించిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు ఆ సందర్భంగా చాలా చెప్పారు.  పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యమిచ్చి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని విస్తృతంగా అభివృద్ధి పరచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పర్యాటక విభాగంలో ఆంధ్ర ప్రదేశ్ చేస్తున్న కృషికి గుర్తింపుగా నాలుగు అవార్డులు వచ్చాయని ఆయన చెప్పారు.  గుజరాత్ తరువాత విశాలమైన సముద్ర తీరప్రాంతం కలిగిన ఆంధ్ర ప్రదేశ్ కోస్తాతీరం పర్యాటక రంగ అభివృద్ధికి ఎంతో అనువుగా ఉందని... ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధికి ఎంతో అనువైన అవకాశాలు ఉన్నాయని ఈ అవకాశాలను సద్వినియోగ పరచుకుని పర్యాటకరంగా అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నామని మంత్రి శ్రీనివాస రావు చెప్పారు.  సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించుకుంటూ విశాఖపట్నం, భీమిలి, సూర్యలంక  బీచ్ లను అభివృద్ధి చేస్తున్నామని, స్వదేశీ టూరిజం అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చి రాష్ట్రంలోని, సరిహద్దురాష్ట్రాలలోని ప్రముఖ దేవాలయాలను కలుపుతూ టూరిజం ప్యాకెజీలను నిర్వహిస్తున్నామని, ఉత్తరాంధ్రలోని ప్రముఖ దేవాలయా ,పర్యాటక  ప్రాంతాలను కలుపుతూ ఇప్పటికే టూరిస్ట్ ప్యాకెజీలను నిర్వహిస్తున్నామనీ అన్నారు. మరి ఇవన్నీ మంత్రి శ్రీనివాసరావు ఘనతలేనా... ఆయన చెబుతున్నట్లు పర్యటకరంగంలో భద్రత సంగతేంటన్న ప్రశ్న వినిపిస్తోంది. ముఖ్యంగా గోదావరిలో బోటు మునిగిపోయి ఎంతమంది చనిపోయారో ప్రత్యేకంగా గుర్తుచేయనవసరం లేదు.
మరోవైపు... పాలన చేపట్టి నాలుగు నెలలవుతున్నా కూడా ఇప్పటికీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా అది గత ప్రభుత్వం చేసిన తప్పేనని ఘోసిస్తున్న ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఇప్పుడీ పర్యటక అవార్డు కానీ, సేంద్రియ రంగంలో గుర్తింపు కానీ గత ప్రభుత్వం చేసిన పనుల ఫలితమేనని ఎందుకు అంగీకరించడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తప్పులు జరిగితే చంద్రబాబు ప్రభుత్వంపై నెట్టేసి... మెప్పులు పొందే వేళ చంద్రబాబు క్రెడిట్ కూడా నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకోవడం ఏమిటంటూ వైసీపీ ప్రభుత్వాన్ని జనం ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ ఈ పర్యాటక అవార్డు చంద్రబాబు పాలన కాలంలోని 2017-18 సంవత్సరాలకు వచ్చిందని ఎక్కడా చెప్పడం లేదు వైసీపీ ప్రభుత్వం.
‘‘నిజానికి చంద్రబాబు వంటి నాయకుల పాలన తీరే అలా ఉంటుంది. దీర్ఘకాలిక ప్రయోజనాల మేరకు పనిచేస్తారు. ఆ బాటలో ఇతరులు ఫలాలు అనుభవిస్తుంటారు. జాతీయ స్థాయిలో వాజపేయి, పీవీ నరసింహారావు వంటివారూ ఇలాంటి బాటలే వేశారు. కానీ, కొద్ది మంది నాయకులు తాత్కాలిక ప్రయోజనాలు ఆశించి ఉచిత పథకాలపైనే ఆధారపడుతూ నిర్మాణాత్మక అభివృద్ధిని మరిచిపోతారు. మొదటి రకం నాయకులు(చంద్రబాబు తరహా) ప్రజలకు సమస్యలు లేకుండా, ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా పాలిస్తారు.. రెండో రకం నాయకులు ప్రజలను కష్టపెట్టి, ప్రభుత్వంపై భారం వేసి రాష్ట్రాలను అప్పుల్లోముంచేస్తారు’’ ఓ రాజకీయ విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు.