పబ్లిగ్గా బీజేపీ చీటింగ్

September 21, 2020

ఏపీ రెండు వర్గాలుగా చీలిపోయంది. అమరావతి మద్దతుదారులు. 3 రాజధానుల మద్దతుదారులు. అయితే... మెజారిటీ మాత్రం అమరావతినే కోరుకుంటున్నారు. దీనికి కారణం... ఇప్పటికే చాలా సదుపాయాలు సమకూరడం. వేలాది మంది రైతుల భూములు తీసుకోవడం. కేంద్ర సంస్థలకు భూకేటాయింపులు, విద్యాసంస్థలు హోటళ్ల ఏర్పాటు, రాష్ట్రానికి మధ్యలో ఉండటం వంటి అనేక కారణాల వల్ల జగన్ కి ఓట్లేసిన జనం చాలా మంది అమరావతికే జై కొడుతున్నారు.  

రాజకీయంగా కూడా చరిత్రలో ఏనాడూ ఏ విషయంపై ఏకం కాని వామపక్షాలు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఇలా విభిన్న సిద్ధాంతాలతో బతికే పార్టీలు కూడా సమష్టిగా అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నాయి. అయితే...  మిగతా అన్ని పార్టీలు అమరావతిపై ఒక క్లారిటీతో ఉన్నాయి. కానీ బీజేపీ మాత్రం తన ఇష్టానుసారం మాట్లాడుతూ ఏపీ ప్రజలను ఇప్పటికీ పబ్లిగ్గా చీట్ చేస్తోంది.

ఒకవైపు జనసేనతో కలిసి అమరావతి మన రాజధాని, మూడు రాజధానులకు వ్యతిరేకం అంటుంది. తరలింపును వ్యతిరేకిస్తున్నాం అంటుంది. కానీ... కేంద్రం నుంచి ఏ చర్యలు తీసుకోదు. అమరావతికి అనుకూలమట. కానీ ఆపగలిగి ఉండి ఆపదట. పైగా ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడిన తీరుచూస్తే ఏపీ ప్రజలకు కడుపు మండేలా ఉంది. వీరి కంటే గోడ మీద పిల్లి నయం.

‘‘కేంద్ర ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన విషయంలో జోక్యం చేసుకోదు. రాష్ట్రాల పరిధిల్లోని వ్యవహారాల్లో కేంద్ర జోక్యం ఉండదు. అందుకే పశ్చిమ బెంగాల్ సహా కొన్ని రాష్ట్రాల్లో అరాచక పరిస్థితులు నెలకొన్నా కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఏపీలో రాజధాని తరలింపు విషయంలోనూ కేంద్రం స్పందించకపోవచ్చు’’ అని అన్నారు.

మరి అమరావతి గురించి న్యూట్రల్ గా ఉండొచ్చు కదా ప్రగల్బాలు ఎందుకు? వ్యతిరేకించడం ఎందుకు? అని ప్రశ్నిస్తే... ప్రజా క్షేత్రంలోకి వెళ్తారట.  పోరాటాలు చేస్తారట. కొంతకాలం వేచిచూస్తే ఎన్నికల్లో వైకాపాకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారట.  మూడు రాజధానులు వద్దట.  కర్నూలులో హైకోర్టు పెట్టడానికి ఓకేనట.  ఇవీ బీజేపీ మాటలు. ఇప్పటికీ ఏపీ ప్రజలు బీజేపీని నమ్మితే వారికంటే వెర్రోళ్లు ఎవరు ఉండరు. 

ఇక్కడ మరో విషయం గమనించాలి. 2019 మ్యానిఫెస్టోలో బీజేపీ ఏం చెప్పిందో తెలుసా? బీజేపీ గెలిస్తే రైతుల భూములు తిరిగి ఇచ్చేస్తానని చెప్పింది. మరి అలాంటపుడు ఇపుడు నేరుగా జగన్ కి మద్దతు ఇవ్వచ్చు కదా. ఈ డొంక తిరుగుడు ఎందుకు? ఏపీపైన ఇంత కసి ఎందుకు? అన్నది ఏపీ ప్రజల ప్రశ్న. కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టు వీరిని నమ్ముకుని పవన్ కళ్యాణ్... ఢిల్లీ వెళ్తా, జగన్ అంతు చూస్తా... రాజధాని ఆపుతా అంటూ సవాళ్లు విసురుతున్నారు. ఎంతో చైతన్యవంతులు అనుకునే ఏపీ నేతలు అంత బలహీనులు ఎవరూ లేరని తాజా పరిణామాలతో అందరికీ అర్థమైపోయింది.