బొత్స గురించి ఫన్నీ కామెంట్స్ చేసిన టీడీపీ లీడర్

September 24, 2020

వైసీపీ ప్రభుత్వానికి ఎవరైనా సరైన బుద్ధి నేర్పాలని... రాజధాని మారిస్తే అభివృద్ధి జరిగిపోతుందనే భ్రమలో ప్రజలకు తీరని నష్టం చేస్తున్నారని తెలుగుదేశం నేత కూన రవికుమార్ విమర్శించారు. మూడు రాజధానులు పెడితే అభివృద్ధి జరుగుతుందని మూడు తలల రావణాసురుడిలా జగన్ ప్రవర్తిస్తున్నారని కూన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై ఏ మాత్రం గౌరవం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని రవి విమర్శించారు. ప్రజలకు అవసరమైనది అభివృద్ధి వికేంద్రీకరణ. రాజధానులు పెడితే ఏమీ రాదు. అభివృద్ధి సమంగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తే ప్రజలు బాగుపడుతారు. పెట్టుబడులు వస్తే ప్రజలకు ఉపాధి పెరుగుతుంది. దీనిపై ప్రభుత్వం కనీసం అవగాహనతో ముందుు వెళ్లడం లేదు అని ఆయన ఆరోపించారు.

బొత్స సత్యనారాయణ ఆంధ్ర బిత్తిరి సత్తి అని... ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని, రకరకాల మాటలతో అందరినీ గందరగోళ పరిచి ప్రజల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని అన్నారు. స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. ఉత్తరాంధ్రపై ప్రేమ కురిపిస్తున్నారు. మీకు నిజంగా ప్రేమ ఉంటే... ఆముదాల వలస, శ్రీకాకుళం మధ్యలో సచివాలయం కట్టి ఆయా జిల్లా అభివృద్ధిని కాపాడాలని రవి సూచించారు. మీ మోసం అతిత్వరలో ప్రజలు అర్థం చేసుకుని బట్టలూడదీసి కొట్టేరోజు వస్తుందని రవికుమార్ వైసీపీ నేతలను హెచ్చరించారు.