జనానికి జగన్ వేసిన మరో దెబ్బ

September 21, 2020

ఆర్టీసీ కార్మికులు త‌మ డిమాండ్ల కోసం స‌మ్మె చేస్తే.. అందులో ఒక్క‌టీ నెర‌వేర‌లేదు. కానీ వాళ్లు స‌మ్మె చేయ‌డం వ‌ల్ల ఆర్టీసీ మ‌రింత న‌ష్టాల్లో కూరుకుపోయింది. ఆర్టీసీని కాపాడేందుకు ప్ర‌భుత్వం నుంచి ఏ ర‌క‌మైన సాయం ప్ర‌క‌టించ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్.. సంస్థ‌ను కాపాడేందుకు ఛార్జీలు పెంచుకునే అవ‌కాశం ఇచ్చేశారు. కిలోమీట‌రుకు 20 పైస‌ల చొప్పుకున ఇక్క‌డ ఛార్జీలు పెరిగాయి. మ‌రి తెలంగాణ‌తో ర‌వాణా ప‌రంగా భాగ‌స్వామ్యం ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.. అక్క‌డ ఛార్జీలు పెంచ‌కుండా ఎలా ఉంటుంది? ఊహించిన‌ట్లే అక్క‌డ కూడా ఛార్జీలు పెరుగుతున్నాయి. ఇంకో వారం లోపే అక్క‌డ ఛార్జీల పెంపు అమ‌ల్లోకి రానుంది.
ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు నిర్ణయానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆమోదముద్ర వేసినట్లు ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించాలంటే ఛార్జీల పెంపు తప్పదని ఆయ‌న‌ స్పష్టం చేశారు. పల్లె వెలుగు, సిటీ సర్వీసుల్లో కిలోమీటరుకు 10 పైసలు, మిగతా బస్సుల్లో కిలోమీటరుకు 20 పైసలు చొప్పున బస్సు ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయ‌న చెప్పారు. ఛార్జీల పెంపు అమలు తేదీని ఈ ఆదివారం లేదా సోమ‌వారం ఆర్టీసీ ఎండీ ప్రకటిస్తారని మంత్రి తెలిపారు. ఆర్టీసీని బతికించ‌డం కోస‌మే ఈ నిర్ణ‌య‌మ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. ఇప్పటికే ఆర్టీసీ రూ.6,500 కోట్ల నష్టాల్లో ఉందని.. ఛార్జీలు పెంచకపోతే సంస్థ దివాళా తీయ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న చెప్పారు.