జైలుకు చంద్రబాబు- గుంటూరులో ఉద్రిక్తత

September 22, 2020

జగన్ రేపిన రాజధాని గొడవలు అణచివేసే కొద్దీ పెద్దగవుతున్నాయి. టీవీ9 మీద దాడి చేసిన కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బాధ్యతాయుతమైన మీడియా ఎవరో రాజకీయ నాయకులు చేసిన పెయిడ్ ఆర్టిస్టులు అనే దాన్ని నమ్మి ప్రచారం చేయడంతో కడుపు రగిలిన రైతులు టీవీ9ను అడ్డుకున్నారు. నిరాధార ఆరోపణలు చేసినందుకు, నిందలు వేసినందుకు ఏ మీడియాను అరెస్టు చేయని పోలీసులు రైతులను అరెస్టు చేయడంపై ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. రైతులకు మద్దతుగా నిన్న అన్ని పార్టీల నేతలు పోలీస్ స్టేషనుకు వెళ్లి నిరసన తెలిపారు. తాజాగా మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారికి సంఘీభావంగా కదిలారు.అమరావతి ప్రాంతంలో అరెస్ట్ చేసి జైలుకు పంపిన ఆరుగురు రైతులను స్వయంగా కలిసి పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జైలుకు బయలుదేరారు. గుంటూరు జిల్లా జైలులో చంద్రబాబు పరామర్శించడానికి బయలుదేరారు. అక్రమంగా రైతులను అరెస్టు చేశారని తెలుగుదేశం ఆరోపిస్తోంది. చంద్రబాబు వారితో మాట్లాడనున్నారు. బాబు రాక నేపథ్యంలో జైలు వద్ద బందోబస్తును పెంచారు.
రైతుల అరెస్టుపై చంద్రబాబునాయుడు ట్విట్టరులో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ’’భూములు కోల్పోయి, పదమూడు రోజులుగా నిద్రాహారాలు మాని వేలాది రాజధాని రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే పట్టించుకోని ప్రభుత్వం... పోలీసులతో అర్ధరాత్రి ఇళ్ళ గోడలు దూకించి రైతులను అరెస్ట్ చేయించడం ఏమిటి? మహిళలు, వృద్దులను భయభ్రాంతులను చేయడం ఏమిటి? ఏమిటీ అమానుషత్వం? ఏమిటీ నిరంకుశధోరణి? రాష్ట్రం కోసం భూములను త్యాగం చేసిన రైతులపై హత్యాయత్నం అభియోగాలా? వాళ్ళేమైనా మీలా గూండాలా? దొంగలా? జరిగిన ఘటనలకు పోలీసులు పెట్టిన సెక్షన్లకు పొంతన ఉందా? ఇంత చేతకాని, నిరంకుశ ప్రభుత్వాన్ని దేశం ఇంతవరకూ చూడలేదు. వేలాది పోలీసులను దించి రైతుల ఆందోళనలను అణిచేయాలనుకోవడం మూర్ఖత్వం’’ అని చంద్రబాబు పోలీసులపై ప్రభుత్వంపై మండిపడ్డారు.