ఏది నిజం.. మీడియాకు ఆడియో పంపిన చిరు

September 22, 2020
CTYPE html>
మెగాస్టార్ చిరంజీవి పేరు రెండు రోజులుగా సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటు దిశగా జగన్ సర్కారు ప్రతిపాదనను స్వాగతిస్తూ ఆయన శనివారం ఇచ్చిన ప్రెస్ నోట్ పెద్ద చర్చకే దారి తీసిన సంగతి తెలిసిందే. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న ఆయన.. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన విధానానికి విరుద్ధంగా జగన్ ప్రతిపాదనను స్వాగతించడం చాలామందికి మింగుడు పడటం లేదు. ఐతే ఈ స్టేట్మెంట్ ఫేక్ అని.. ఇది అసలు చిరు రిలీజ్ చేయలేదని.. వైఎస్సార్ కాంగ్రెస్ వాళ్లే దీన్ని సృష్టించారని జనసైనికులు, మెగా అభిమానులు కౌంటర్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ల వాదన చూస్తే జనాలకు సందేహాలు కలిగాయి. కానీ అన్ని ప్రధాన మీడియాల్లో చిరు స్టేట్మెంట్ వాస్తవమే అన్నట్లుగా వార్తలు రావడం జనాలు అయోమయంలో పడ్డారు.
ఇంతలో ఈ రోజు నిన్న తాను మూడు రాజధానుల ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్లు ప్రెస్ నోట్ ఇచ్చానన్న విషయం అబద్ధమంటూ చిరు లెటర్ హెడ్‌తో ఒక ప్రెస్ నోట్ బయటికి వచ్చింది. తాను ఈ రాజధానుల విషయమై సానుకూలంగా కానీ, వ్యతిరేకంగా కానీ స్పందించలేదని.. జరుగుతున్న ప్రచారం అబద్ధమని.. రాజకీయాలకు దూరంగా ఉన్న తన దృష్టి అంతా సినిమాల మీదే ఉందని చిరు పేర్కొన్నట్లుగా ఉంది ఆ ప్రెస్ నోట్లో. దీంతో ఏది వాస్తవం.. ఏది అబద్ధం అనేది అర్థం కాక మరింత గందరగోళం నెలకొంది. ఐతే ఈ గందరగోళానికి తెరదించడం కోసం చిరు నేరుగా మీడియా వాళ్లకు ఒక ఆడియో క్లిప్ పంపడం విశేషం. నిన్న మూడు రాజధానుల ప్రతిపాదనను స్వాగతిస్తూ తాను ప్రెస్ నోట్ ఇచ్చిన మాట వాస్తవమని.. ఈ రోజు దానికి భిన్నంగా వచ్చిన ప్రెస్ నోట్ ఫేక్ అని ఆయన అందులో స్పష్టం చేశారు. కాబట్టి గందరగోళానికి ఇక తెర పడ్డట్లే. చిరు జగన్‌కు జై కొట్టినట్లే.