మోడీ కి అవమానం  

September 24, 2020

ఏడు సముద్రాలు ఈదిన వాడు... ఇంటి వెనుక మురికి గుంటలో పడినట్టు ఉంది మోడీ షాల పరిస్థితి. దేశంలో రెండు సార్లు అప్రతిహత మెజారిటీతో గద్దెనెక్కినా... వారు కూర్చున్న ఢిల్లీ ప్రజల మనసు మాత్రం గెలవలేకపోతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే... రచ్చ గెలిచి ఇంట ఓడిపోతున్నారు. 

తాజాగా దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల ఓటింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. అందరూ ఊహించినట్లే మరోసారి అరవింద్ కేజ్రీవాల్ కే పీఠం దక్కనుందని అవి చెబుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీలో 70 మంది సభ్యులుంటే.. అత్యధిక స్థానాలతో ఆప్ గెలవనుందని చెబుతున్నారు.

70 స్థానాలకు మొత్తం 672 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సీఎం కేజ్రీవాల్​ పై 26 మంది అభ్యర్థులు​ పోటీ పడ్డారు.​ 11​వ తేదీ​న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. కాంగ్రెస్ కంటే బీజేపీ మెరుగ్గా కనిపించడం ఇందులో స్పెషల్. కానీ... అన్ని ఎగ్జిట్ పోల్స్ ఆప్ కి అత్యధిక సీట్లు కట్టబెట్టడం గమనార్హం. 2015అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాల్లో గెలుపొంది చరిత్ర సృష్టించింది.​ ఇపుడు కూడా దాదాపుగా అదే సీన్ రిపీటయ్యేలా కనిపిస్తోది. మహా అయితే ఐదారు సీట్లు తగ్గొచ్చట.

​కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు... తానుంటున్న ఢిల్లీలో గెలవకపోవడానికి అనేక కారణాలున్నాయి. మొదటి కారణం... ఆప్ పాలన జనరంజకంగా ఉండటం. రెండో ప్రధాన కారణం... సర్వ మత, సర్వ కుల, సర్వ దేశ ప్రజలు ఉన్న ఢిల్లీలో లౌకిక వాదానిదే మెజారిటీ. పైగా ఆర్థికంగా కూడా మెరుగైన ఆలోచన ఉన్న ఉద్యోగ వర్గం అక్కడ ఎక్కువ కాబట్టి... వారి మద్దతు  కూడా ఆప్ కే లభించినట్లు తెలుస్తోంది. వీటికితోడు పుండు మీద కారం చల్లినట్లు... సరిగ్గా ఢిల్లీ ఎన్నికల సమయానికి ఎన్నార్సీ తుట్టెను కదలించి తన సీటు కిందకు నీళ్లు తెచ్చుకున్నారు మోడీ. కొన్ని వర్గాలు ఆప్ నచ్చకపోయినా... మోడీని ఓడించడానికి ఆప్ కే ఓటేసే పరిస్థితి వచ్చింది. ఏతావాతా.... తాను దేశానికి ప్రధాని... కానీ తనకు ముఖ్యమంత్రి మాత్రం తన ప్రత్యర్థి అన్నట్టుంది మోడీ పరిస్థితి. ఈసారి ఢిల్లీలో బీజేపీ ఓడిపోవడం అంటే... మోడీకి అవమానం కిందే లెక్క.